తిరుమల శ్రీవారి భక్తులకు ఇక నుంచి అడిగినన్ని లడ్డూలు ఇవ్వాలని టీటీడీ నిర్ణయించింది. ప్రతి రోజూ తిరుమలలో 3.5 లక్షల లడ్డూలు అవసరం ఉంటుంది. మరో 5 వేల కళ్యాణం లడ్డూరు, 6 వేల వడలు డిమాండ్ ఉంది. ఇవి కాకుండా స్వామివారి దర్శనం చేసుకునే 70 వేల మంది భక్తులకు ఒక లడ్డూ చొప్పున ఉచితంగా అందిస్తున్నారు. రోజూ 4 లక్షల 20వేల లడ్డూల అవసరముందని టీటీడీ గుర్తించింది.
తిరుమలతోపాటు, బెంగళూరు,అమరావతి రాజధాని, హైదరాబాద్‌లోని శ్రీవారి ఆలయాల్లోనూ లడ్డూలు విక్రయిస్తున్నారు. డిమాండుకు సరిపడా లడ్డూల తయారీకి మరో 74 మంది శ్రీశైష్ణవులను నియమించాలని టీటీడీ నిర్ణయించింది. మరో పది మంది శ్రీవైష్ణవులు కాని వారిని కూడా నియామకం చేయనున్నారు.
శ్రీవారి లడ్డూలు ప్రస్తుతం పరిమితంగా విక్రయిస్తున్నారు. తిరుమల లడ్డూలకు దేశ, విదేశాల్లోనూ డిమాండ్ ఉండటంతో భక్తులు కోరినన్ని విక్రయించాలని టీటీడీ నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా పోటులో ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. రాబోయే కొద్ది రోజుల్లోనే భక్తులు అడిగినన్ని లడ్డూలు విక్రయించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.