తాను అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టే నాటికి బందీలకు విముక్తి కల్పించాలని లేదంటే చర్యలు తీవ్రంగా ఉంటాయని డొనాల్డ్ ట్రంప్ హమాస్ ఉగ్రమూకలను హెచ్చరించారు. తాను జనవరి 20న అమెరికా అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టముందే 51 మంది బందీలను విడుదల చేయాలని ఆయన హెచ్చరించారు. లేదంటే తరవాత తాను తీసుకునే చర్యలు అత్యంత దారుణంగా ఉంటాయంటూ హెచ్చరించారు.
గత ఏడాది అక్టోబర్ 7న పాలస్తీనాకు చెందిన హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌పై జరిపిన పాశవిక దాడిలో 1200 మంది ప్రాణాలు కోల్పోయారు. 250 మందిని బందీలుగా పట్టుకున్నారు. వారిలో 150 మందిని వదిలేశారు. కొందరు ప్రాణాలు కోల్పోయారు. హమాస్ ఉగ్రవాదుల వద్ద ఇంకా 51 మంది బందీలుగా ఉన్నట్లు ఇజ్రాయెల్ చెబుతోంది.
ఇటీవల హమాస్ చెరలోని అమెరికన్ ఇజ్రాయెలీ ఎడాన్ ఓ వీడియోను విడుదల చేశారు. తాము హమాస్ ఉగ్రవాదుల చెరలో రోజుకు 1000 సార్లు చస్తున్నామని, వెంటనే విడుదల చేయించాలని కోరాడు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు ఇచ్చిన హామీ మేరకు బందీలను విడుదల చేయించాలని ఎడాన్ తల్లి వాపోయారు. ఈ వీడియో వైరల్ అయింది. ఆ వెంటనే అమెరికాకు కాబోయే అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు.
హెజ్బొల్లా ఉగ్రవాదులతో కుదిరిన 50 రోజుల కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ ఉల్లంఘించిందని లెబనాన్ ఆరోపిస్తోంది. తాజాగా ఇజ్రాయెల్ దళాలు దాడులకు దిగాయని, కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిస్తే తాము ప్రత్యక్ష యుద్ధానికి దిగాల్సి ఉంటుందని హొజ్బొల్లా హెచ్చరించింది.