ఇస్కాన్‌కు చెందిన 63మంది సభ్యులు బంగ్లాదేశ్ నుంచి భారత్ వెడుతుండగా ఆదివారం నాడు బేనాపోల్ సరిహద్దు వద్ద అధికారులు వారిని ఆపేసారు. ప్రయాణికులు అందరి దగ్గరా తగిన పాస్‌పోర్టులు, వీసాలు ఉన్నప్పటికీ భారత్ వెళ్ళడానికి వీల్లేదని నిలువరించారు. వారి ప్రయాణానికి తగిన ‘అధికారిక ఆమోదం’ లేదంటూ ఇమిగ్రేషన్ అధికారులు ఇస్కాన్ సభ్యులకు ప్రయాణానికి అనుమతి నిరాకరించారు.
బేనాపోల్ ఇమిగ్రేషన్ పోలీస్ ఆఫీసర్ ఇన్‌ఛార్జ్ ఇంతియాజ్ అహ్సానుల్ కాదర్ భూయాన్, ఇస్కాన్ సభ్యులను సరిహద్దులు దాటనివ్వవద్దంటూ తమకు పై అధికారుల నుంచి ఉత్తర్వులు వచ్చాయని చెప్పారు. ఇస్కాన్ భక్తులకు తగిన పాస్‌పోర్టులు, వీసాలు ఉన్నప్పటికీ వారికి ప్రభుత్వ అనుమతి లేదని ఆయన వివరించారు. ‘‘మేము 54మంది ప్రయాణికులను భారత్ వెళ్ళకుండా ఆపివేసాము. ప్రయాణానికి వారు చెప్పిన కారణాలు అనుమానాస్పదంగా ఉన్నాయి’’ అని భూయాన్ చెప్పారు. మిగతా 9మంది ఇస్కాన్ సభ్యుల గురించి మాత్రం ఆయన ఏమాటా చెప్పలేదు.
బంగ్లాదేశ్‌లోని వేర్వేరు ప్రదేశాల నుంచి శనివారం రాత్రి, ఆదివారం ఉదయం రెండు విడతలుగా ఇస్కాన్ సభ్యులు చెక్‌పాయింట్ దగ్గరకు వచ్చారు. 54 సభ్యుల ఒక బృందాన్ని, 9మంది సభ్యులున్న మరొక బృందాన్నీ అధికారులు నిలిపివేసారు. కొన్ని గంటల తరబడి వారిని ఎదురుచూసేలా చేసి, అప్పుడు వారి ప్రయాణాన్ని ధ్రువీకరించలేదని చెప్పారు. ‘‘మేము భారత్‌లో ఒక ధార్మిక కార్యక్రమంలో పాల్గొనడానికి భారత్ వెడుతున్నాము, కానీ ఇమిగ్రేషన్ అధికారులు మమ్మల్ని అడ్డుకున్నారు. ప్రభుత్వం పర్మిషన్ లేదు అనే ఒక కారణం చూపించారు’’ అని ఇస్కాన్ సభ్యుడు సౌరభ్ తపందర్ చేలీ చెప్పారు.
ఇస్కాన్ కోల్‌కతా ఉపాధ్యక్షుడు రాధారమణ్ దాస్, బంగ్లాదేశ్ అధికారుల నిర్వాకాన్ని తప్పుపట్టారు. ‘‘బంగ్లాదేశ్‌లోని ప్రస్తుత పరిస్థితుల కారణంగా వారు భారతదేశంలో తీర్థయాత్ర చేయాలని భావించారు. కానీ 9మందిని శనివారం, 54మందిని ఆదివారం నిలిపివేసారు. ఈ సమయంలో భారత్ వెళ్ళడం సురక్షితం కాదని, వెనక్కి తిరిగి వెళ్ళిపోవాలనీ వారికి చెప్పారు. తగిన వీసాలు, పాస్‌పోర్టులు ఉన్నా వారిని మరో దేశానికి వెళ్ళకుండా ఎలా ఆపుతారు?’’ అని అడిగారు.
ఈ యేడాది ఆగస్టులో షేక్ హసీనా ప్రభుత్వాన్ని పడదోసిన నాటి నుంచి చూస్తే, బంగ్లాదేశ్‌లో హిందువులపై అఘాయిత్యాలు ఇప్పుడు అత్యధికంగా జరుగుతున్నాయి. ప్రత్యేకించి నవంబర్ 27న ‘బంగ్లాదేశ్ సమ్మిళిత సనాతని జాగరణ్ జోతే’ అధికార ప్రతినిధి, హిందూ సన్యాసి చిన్మయ్ కృష్ణ దాస్ అరెస్టు నుంచీ హిందువులపై మతోన్మాద దాడులు పెచ్చుమీరిపోయాయి. ఢాకాలోని విమానాశ్రయం దగ్గర ఆయనను రాజద్రోహ నేరం కింద నిర్బంధించారు. అలాగే ఇస్కాన్‌కు చెందిన 17మంది వ్యక్తుల బ్యాంకు ఖాతాలను కూడా నెల రోజుల పాటు స్తంభింపజేసారు.