ఒడిషా పోలీసులు సీనియర్ మహిళా మావోయిస్టు అంటి మాద్విని అరెస్ట్ చేసారు. ఆమె తలపై రూ.2లక్షల రివార్డు ఉంది. మాద్విని పోలీసులు మల్కనగిరి జిల్లాలోని కుర్తి అటవీప్రాంతంలో పట్టుకున్నారు.
ఎంవి-79 పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మహిళా మావోయిస్టు తిరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దాన్ని నిర్ధారించుకోడానికి పోలీసులు ఒక ఆపరేషన్ చేపట్టారు. ఆ క్రమంలో అడవిలో అనుమానాస్పదంగా తిరుగుతున్న అంటి మాద్వి ఆచూకీని పోలీసులు కనుగొన్నారు. ఆమెను కస్టడీలోకి తీసుకున్నారు.
ఇంటరాగేషన్‌లో ఆమె తను ఒక మావోయిస్టునని ఒప్పుకుంది. కొన్ని సరుకులు సేకరించడానికి ఆ ఏరియాకు వచ్చినట్లు వెల్లడించింది. అంటి మాద్వి ఒడిషా, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మావోయిస్టు కార్యకలాపాల్లో క్రియాశీలంగా పనిచేసినట్లు పోలీసులకు తెలియజేసింది.
అంటి మాద్వి అలియాస్ లాకే, ఛత్తీస్‌గఢ్‌లోని బిజాపూర్ జిల్లా జంగ్లా పోలీస్ స్టేషన్ పరిధిలోని పుల్హర్ గ్రామస్తురాలు. ఆమె 2017లో మావోయిస్టుల్లో చేరింది. మొదట్లో పశ్చిమ బస్తర్ డివిజన్లో ప్లటూన్ డిప్యూటీ కమాండర్ సుక్రం నాయకత్వంలో పనిచేసింది. 2020 నుంచీ ఆమె సీనియర్ మావోయిస్టు నాయకుడు ఉదయ్‌కి రక్షణ బృందంలో సభ్యురాలిగా పనిచేసింది. ఆ సమయంలో ఆమెకు ఎస్ఎల్ఆర్ గన్ ఇచ్చారు. మూడు రాష్ట్రాల్లోనూ మావోయిస్టు హింసాకాండకు సంబంధించిన పలు కార్యకలాపాల్లో మాద్వి పాల్గొంది.
మాద్విని అరెస్ట్ చేసినట్లు కోరాపుట్‌లోని నైరుతి రేంజ్ డిఐజి నీతి శేఖర్ ధ్రువీకరించారు. ఆమెను పట్టిచ్చిన వారికి రూ.2లక్షలు బహుమతి ఇస్తామని ప్రకటించారు. ఇప్పుడా మొత్తాన్ని, మాద్విని అరెస్ట్ చేసిన పోలీసులకు పంచుతారు. కొద్దిరోజుల క్రితమే ఒడిషాలోని కొంధమాల్ జిల్లాలో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఒక మావోయిస్టు కొంధమాల్ పోలీసులకు లొంగిపోయారు.