సవరణ ఉత్తర్వులు జారీ
తెలంగాణ ప్రభుత్వం, 10వ తరగతి పరీక్షల్లో ఇంటర్నల్ మార్కుల రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. ఈ విద్యా సంవత్సరం (2024-25) నుంచి ఇంటర్నల్ మార్కులు పూర్తిగా తొలగిస్తామంటూ జారీ చేసిన ఉత్తర్వులపై వెనక్కి తగ్గింది. అందుకు సంబంధించిన సవరణ జారీ చేసింది. ఈ ఏడాదికి పాతపద్ధతిలోనే పరీక్షలు ఉంటాయని తెలిపిన తెలంగాణ విద్యాశాఖ, వచ్చే విద్యా సంవత్సరం (2025-26) నుంచి ఇంటర్నల్ మార్కుల రద్దు ప్రక్రియ ప్రారంభమవుతుందని స్పష్టం చేసింది.
పదో తరగతి వార్షిక పరీక్షలకు సంబంధించి ఈ విద్యా సంవత్సరం (2024-25) నుంచి గ్రేడింగ్ విధానాన్ని నిలిపివేయడంతో పాటు ఇంటర్నల్ పరీక్షలకు 20 మార్కులు, వార్షిక పరీక్షలకు 80 మార్కులు విధానాన్ని నిలిపివేస్తున్నట్లు గత ఉత్తర్వుల్లో తెలిపింది. ఫైనల్ పరీక్షల్లో ఆరు సబ్జెక్టులను 600 మార్కులకు నిర్వహించనున్నట్టు తెలపింది.
అయితే ఈ నిర్ణయంపై విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యారంగ నిపుణులు అభ్యంతరం వ్యక్తం చేశారు. విద్యాసంవత్సరం ప్రారంభంలోనే ఇలాంటి నిర్ణయాలు ప్రకటించాలని సూచించారు. పరీక్షలకు 4 నెలల ముందు మాత్రమే ప్రకటించడం సరికాదని హితవుపలికారు. దీంతో ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉప సంహరించుకుంది.
ఇక ఇంటర్నల్ గ్రేడింగ్ రద్దు విధానం వచ్చే ఏడాది (2025-26) నుంచి అమల్లోకి రానుంది.