పొరుగుదేశం బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న అఘాయిత్యాలు, ఇస్కాన్ స్వామీజీ చిన్మయ్ కృష్ణదాస్ అరెస్టు తదితర పరిణామాలపై విశ్వహిందూ పరిషత్ ఆందోళన వ్యక్తం చేసింది. వాటిని ఖండిస్తూ దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేపట్టింది. ఇవాళ, రేపు ఈ నిరసన కార్యక్రమాలు చేపడుతోంది. ఆ మేరకు విహెచ్పి ఆంధ్రప్రదేశ్ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది.
‘‘బంగ్లాదేశ్‌లో ఇస్లామిక్ ఉన్మాద జిహాదీ మూకలు హిందువులు, ఇతర మైనారిటీలను నిరంతరం హింసించడం, హిందూ దేవాలయాలపై దాడులు చేయడం, దేవీ దేవతల విగ్రహాలు కూల్చడం, అపవిత్రం చేయడం, హిందువుల ఆస్తులపై దాడులు చేయడం కొనసాగుతోంది. వాటిని అరికట్టేందుకు బంగ్లాదేశ్ ప్రభుత్వం ప్రయత్నం చేయడం లేదు. హిందువులపై దాడులకు నిరసనగా ఢాకా, చిట్టగాంగ్ తదితర నగరాల్లో హిందూ సమాజం పెద్దసంఖ్యలో శాంతియుత నిరసనలు నిర్వహించింది. ప్రపంచదేశాలు, భారత్ చేసిన సూచనలను బంగ్లాదేశ్ ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోలేదు. అక్కడి హిందువుల రక్షణకు ఎలాంటి పటిష్టమైన చర్యలూ తీసుకోలేదు.
హిందువులపై నిరంతర దాడులు జరుగుతున్నా పట్టించుకోని బంగ్లాదేశ్ ప్రభుత్వం, ఆ దాడులను అరికట్టి, దాడులు చేస్తున్న వారిని గుర్తించి, వారిపై చర్యలు తీసుకోని బంగ్లాదేశ్ ప్రభుత్వం, హిందువుల భద్రత మరియు ధార్మిక సంస్థల పరిరక్షణ కోసం హిందూ సమాజాన్ని మేల్కొలుపుతున్న ఇస్కాన్ స్వామీజీ పూజ్యశ్రీ చిన్మయ కృష్ణ దాస్‌ను అరెస్ట్ చేసింది. కోర్టు ద్వారా బెయిల్ కూడా రాకుండా ప్రభుత్వం బెయిల్ తిరస్కరించబడేలా చేసింది.
స్వామీజీ అరెస్ట్‌కు నిరసన వ్యక్తం చేస్తూ, స్వామీజీని వెంటనే విడుదల చేయాలంటూ దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని విశ్వహిందూ పరిషత్ నిర్ణయించింది. దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లోనూ ప్రధాన కూడళ్ళు, బహిరంగ ప్రదేశాల్లో నిరసన ప్రదర్శన నిర్వహిస్తుంది. చిన్మయ్ కృష్ణ దాస్ ప్రభు గారిని వెంటనే విడుదల చేయాలి, బంగ్లాదేశ్‌లో హింసను అరికట్టాలి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విశ్వహిందూ పరిషత్ ఆంధ్రప్రదేశ్ శాఖ డిమాండ్ చేస్తోంది. బంగ్లాదేశ్‌లోని హిందువుల మానవ హక్కులను కాపాడాలని డిమాండ్ చేస్తోంది.’’
విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర శాఖ కార్యదర్శి తనికెళ్ళ సత్య రవికుమార్ ఆధ్వర్యంలో విజయవాడలో రేపు ఈ నిరసన కార్యక్రమం నిర్వహిస్తారు.