విద్యార్ధుల్లో క్రూర ప్రవృత్తి పెరిగిపోతోంది. దీనికి అద్దం పట్టే ఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. తాడికొండ మండలం పొన్నెకల్లు ప్రభుత్వ పాఠశాలల్లో సమీర్ అనే అనాథ విద్యార్థి 9వ తరగతి చదువుతున్నాడు. సమీర్ తల్లిదండ్రులు చనిపోయారు. నాయనమ్మ మస్తాన్ బీ వద్ద ఉండి చదువుకుంటున్నాడు. ఇటీవల సమీర్‌తో సహ విద్యార్థులు తరచూ గొడవపడుతున్నారు. గత నెల 24న పాఠశాలలో డ్రిల్ జరుగుతుండగా, పది మంది విద్యార్థులు కలసి సమీర్‌ను సమీపంలోని బావి వద్దకు ఈత పేరుతో తీసుకెళ్లారు. వారు సమీర్‌ను కొట్టి చంపి బావిలో పడేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. సమీర్ ప్రాణాలు కోల్పోయాడు.
విషయం తెలుసుకున్న గ్రామస్థులు, ఉపాధ్యాయులు సమీర్ మృతదేహాన్ని గుట్టుచప్పుడు కాకుండా అంత్యక్రియలు నిర్వహించారు. సమీర్ ఈత రాక చనిపోయాడంటూ ప్రచారం చేశారు.కర్లపాలెం సర్పంచ్ చొరవతో సమీర్ నాయనమ్మ మస్తాన్‌బీ బాధితురాలు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. విచారణకు ఆదేశించడంతో కుట్ర కోణం వెలుగు చూసింది.
సమీర్ చొక్కాపై రక్తపు గాయాలు ఉండటంతో సహ విద్యార్థులు కొట్టి చంపి బావిలో పడేశారని పోలీసులు అనుమానిస్తున్నారు. విద్యార్థి మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం కోసం పంపిస్తున్నారు. నివేదిక వచ్చిన తరవాత కుట్రలో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశముందని పోలీసు అధికారులు చెబుతున్నారు.