రఘునందన్ పాశ్వాన్ అనే 21ఏళ్ళ యువకుడిని పాశవికంగా నరికి చంపిన కేసులో నిందితుడైన మొహమ్మద్ సత్తార్‌ను ముంబై పోలీసులు ఇవాళ అరెస్ట్ చేసారు. సత్తార్ అక్టోబర్ 31న రఘునందన్‌ను ఏడు ముక్కలుగా నరికి గోరై బీచ్‌లో పడవేసాడు. మతాంతర ప్రేమసంబంధమే రఘు హత్యకు ప్రధాన కారణమయిందని ముంబై పోలీసులు నిర్ధారించారు.
ముంబై పోలీసులు, రఘునందన్ తండ్రి చెప్పిన వివరాల ప్రకారం… రఘునందన్ బిహార్ దర్భంగా జిల్లాలోని కన్హోలీ గ్రామానికి చెందినవాడు. మొదట్లో బిహార్‌లో ఒక ఆస్పత్రిలో పనిచేసేవాడు. అక్కడే సత్తార్ చెల్లెలితో పరిచయమైంది. ఆస్పత్రిలో ఆమెకు మందుల విషయంలో సాయం చేసేవాడు. ఆ అమ్మాయి ముంబై వెళ్ళిపోయాక కూడా వారిద్దరూ ఫోన్‌లో మాట్లాడుకునేవారు.
విషయం తెలిసి సత్తార్, అతని సోదరుడు రఘునందన్‌ను చంపేస్తామని బెదిరించారు. తర్వాత రఘు ఆస్పత్రిలో పని మానేసాడు. తన తండ్రితో కలిసి పుణేలో పనిలో చేరాడు. అయితే బాలిక అన్నలు రఘునందన్‌ను వదిలిపెట్టలేదు. అతన్ని మాయమాటలు చెప్పి ముంబైకి పిలిపించారు. మత్తుమందు ఇచ్చి చంపేసారు.
రఘు హత్య అక్టోబర్ 31న జరిగింది. అతని శవాన్ని ముక్కలు ముక్కలుగా చేసి ప్లాస్టిక్ సంచుల్లో మూటలు కట్టారు. నవంబర్ 1న ఆ మూటలను ఆటోలో గోరై బీచ్‌కు తీసుకువెళ్ళి అక్కడ పడేసారు. ఆ బీచ్‌కు దగ్గరున్న షెఫాలీ గ్రామస్తులు నవంబర్ 10న దుర్వాసన ఆధారంగా రఘునందన్ శవాన్ని గమనించారు. వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
ఒకవైపు లవ్‌జిహాద్ పేరిట హిందూ అమ్మాయిలను ట్రాప్ చేస్తున్న సంఘటనలు, హిందూ అమ్మాయిలను ముక్కలు ముక్కలుగా నరికి హత్యలు చేస్తున్న సంఘటనలూ వెలుగు చూస్తున్నాయి. హిందూ అబ్బాయిలు ముస్లిం అమ్మాయిలను ప్రేమించి పెళ్ళి చేసుకునే సందర్భాలు సాపేక్షంగా చాలా తక్కువ. అలాంటి ఈ కేసులో హిందూ అబ్బాయిని కూడా పాశవికంగా ముక్కలుగా నరికి చంపేయడం గమనార్హం.