బంగ్లాదేశ్‌లో షేక్ హసీనాను తరిమి కొట్టి, ఆమె ప్రభుత్వాన్ని పడగొట్టాక ఏర్పడిన తాత్కాలిక మధ్యంతర ప్రభుత్వం ఆ దేశ రాజ్యాంగాన్నే మార్చాలని భావిస్తోంది. నోబెల్ పురస్కార గ్రహీత మొహమ్మద్ యూనుస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం రాజ్యాంగంలో పలు మార్పులు ప్రతిపాదించింది.
దేశంలో 90శాతం పైగా జనాభా ముస్లిములు ఉన్నందున బంగ్లాదేశ్ లౌకికవాద దేశం కాదని, ఆ మేరకు రాజ్యాంగాన్ని మార్చాలనీ, దేశాన్ని ఇస్లామిక్ దేశంగా ప్రకటించాలనీ మొహమ్మద్ యూనుస్ పట్టుపట్టారు.
లౌకికవాదం అనేది బంగ్లాదేశ్ వాస్తవికతను ఇంకెంతమాత్రమూ ప్రతిఫలించబోదని అటార్నీ జనరల్ మొహమ్మద్ అసదుజ్జమాన్ వాదించారు. 15వ రాజ్యాంగ సవరణ చట్టబద్ధతపై హైకోర్టులో జరిగిన విచారణలో అటార్నీ జనరల్ ఈ వాదన చేసారు.
బంగ్లాదేశ్ రాజ్యాంగం నుంచి లౌకికవాదం, సామ్యవాదం, బంగ్లా జాతీయవాదం అనే పదాలను తొలగించాలని అటార్నీ జనరల్ వాదించారు. అంతేకాదు, షేక్ ముజిబుర్ రెహమాన్‌ను బంగ్లాదేశ్ జాతిపిత అని వ్యవహరించడాన్ని కూడా తొలగించాలని వాదించారు. షేక్ ముజిబుర్ రెహమాన్ కుమార్తె హసీనా నేతృత్వంలోని అవామీలీగ్, సాపేక్షంగా ఉదారంగా వ్యవహరించే రాజకీయ పార్టీ. ఆ పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని కొన్ని నెలల క్రితమే అంతర్జాతీయ కుట్రతో పడదోసి, మొహమ్మద్ యూనుస్ గద్దెనెక్కారు.