ఝార్ఖండ్ శాసనసభకు జరుగుతున్న ఎన్నికల్లో మొదటి దశ పోలింగ్ ఇవాళ జరుగుతోంది. ఉదయం 9 గంటల సమయానికే 13.04శాతం పోలింగ్ జరిగిందని భారత ఎన్నికల సంఘం ప్రకటించింది.
ఝార్ఖండ్‌లో మొత్తం 81 శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి. వాటిలో 43 స్థానాలకు ఇవాళ పోలింగ్ జరుగుతోంది.
పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ జరక్కుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రాష్ట్ర రాజధాని రాంచీలో డ్రోన్లతో నిఘా నిర్వహిస్తున్నారు.
ఝార్ఖండ్ నుంచి కేంద్ర క్యాబినెట్లో ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి అన్నపూర్ణాదేవి కోడెర్మాలో తన ఓటుహక్కు వినియోగించుకున్నారు. రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివన్ష్ రాంచీలో ఓటు వేసారు. ఝార్ఖండ్ గవర్నర్ సంతోష్ కుమార్ గాంగ్వర్ కూడా తన ఓటుహక్కు వినియోగించుకున్నారు.
ఝార్ఖండ్‌లోని 15 జిల్లాల్లో ఉన్న 43 నియోజకవర్గాల్లో ఈ ఉదయం 7గంటలకు పోలింగ్ మొదలైంది. సాయంత్రం 5 గంటలవరకూ పోలింగ్ జరుగుతుంది. 950 సమస్యాత్మక పోలింగ్ బూత్‌లలో 4గంటలకే పోలింగ్ ముగుస్తుంది. ఈ దశ ఎన్నికల కోసం 200కు పైగా కంపెనీల బలగాలు రక్షణ కల్పిస్తున్నాయి. ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశలో మొత్తం 683మంది అభ్యర్ధులు బరిలో ఉన్నారు, వారిలో 73మంది మహిళలు కూడా ఉన్నారు.
కేరళలోని వయనాడ్ లోక్‌సభ స్థానానికి, 10 రాష్ట్రాల్లోని 31 అసెంబ్లీ నియోజకవర్గాలకూ ఉపయెన్నికల పోలింగ్ కూడా ఇవాళే జరుగుతోంది.