హిందువులకు పరమపవిత్రమైన తిరుమల కొండపై రాజకీయ ఉపన్యాసాలు చేసినా, ఇతర ఎలాంటి దుష్ప్రచారం చేసినా, వారిపై కఠిన చర్యలు ఉంటాయని టీటీడీ బోర్డు సభ్యుడు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఆలయాలకు మంచిరోజులు వచ్చాయని ఆయన వ్యాఖ్యానించారు. వేంకటేశ్వర స్వామి క్షేత్ర ప్రాశస్త్యాన్ని పాలకమండలి కాపాడుతుందని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్వామి వారి ప్రసాదం నాణ్యత పెరిగిందని వివరించారు.
‘‘టీటీడీలో అన్యమతస్తులు ఎవరూ పనిచేయటానికి వీలు లేదని చైర్మన్ స్పష్టంగా తెలియచేసారు. అలాంటివారు ఎవరైనా ఉంటే వారు బదిలీ చేయించుకోవాలి, లేదా వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవాల్సిందే’’ అని భానుప్రకాష్ స్పష్టం చేసారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హిందూధర్మ పరిరక్షణకై పని చేస్తోందని చెప్పారు. దేవాలయ దర్శనానికి రాదలచుకున్న అన్యమతస్తులు తప్పనిసరిగా టీటీడీ నిబంధనల ప్రకారం డిక్లరేషన్ మీద సంతకం చేసి తీరాల్సిందేనని భానుప్రకాష్ తేల్చిచెప్పారు.
‘‘గత వైఎస్ఆర్‌సిపి ప్రభుత్వ పాలనలో దేవాలయాలపై దాడులు, విగ్రహాలు మాయం చేసి విధ్వంస ఘటనలు సృష్టించారు. ఆ ఐదేళ్ళూ హిందూ వ్యతిరేక పాలన జరిగింది. అప్పట్లో టీటీడీలో తీసుకున్న నిర్ణయాలను వెబ్‌సైట్‌లో పొందుపరచలేదు. ధార్మిక క్షేత్రాన్ని ధనార్జన క్షేత్రంగా మార్చారు. గత ప్రభుత్వంలో దేవాలయాల నుంచి దోచుకున్న డబ్బు మొత్తం కక్కిస్తాము. అధర్మ కార్యక్రమాలు చేసిన వ్యక్తులను వదిలే ప్రసక్తే లేదు’’ అని భానుప్రకాష్ రెడ్డి చెప్పారు.
ఇవాళ విజయవాడ వచ్చిన బిజెపి అధికార ప్రతినిధి, తితిదే పాలకమండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డికి ఎన్టీఆర్ జిల్లా బిజెపి నేతలు సన్మానం చేశారు. ఆ కార్యక్రమానికి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరాం అధ్యక్షత వహించారు. బిజెపి రాష్ట్ర మీడియా ఇంఛార్జి పాతూరి నాగభూషణం, మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ, మువ్వల వెంకటసుబ్బయ్య, శ్రీధర్, మాదల రమేష్, పట్నాయక్ తదితరులు హాజరయ్యారు.