ఛత్తీస్‌గఢ్‌లోని రాయగఢ్‌లో క్రైస్తవ మిషనరీల బలవంతపు మతమార్పిడుల ఆరోపణలు ఆదివారం సంచలనం కలిగించాయి. పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేసి, మరో పదిమందిని అదుపులోకి తీసుకున్నారు.
రాయగఢ్‌లోని ఒక ఇంట్లో క్రైస్తవ సామూహిక ప్రార్థనల పేరిట బలవంతపు మతమార్పిడులు జరుగుతున్నాయన్న సమాచారంతో విశ్వహిందూ పరిషత్, తదితర హిందూ సంస్థలు అక్కడికి చేరుకున్నాయి. మతమార్పిడులను అడ్డుకోవాలంటూ నినాదాలు చేసాయి. పోలీసులకు సమాచారమివ్వడంతో వారు అక్కడికి చేరుకున్నారు.
మతమార్పిడులు జరుగుతున్న మూడంతస్తుల భవనం నుంచి పెద్దసంఖ్యలో మహిళలు, పిల్లలను క్షేమంగా తరలించారు. సాల్ నాగా, ఇంద్రజీత్ ఖరే అనే ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసారు. మరో పదిమందిని అదుపులోకి తీసుకున్నారు. బలవంతపు మతమార్పిడుల వ్యవహారంలో వారి ప్రమేయం గురించి ప్రశ్నిస్తున్నారు.
ప్రలోభాలతో మతమార్పిడులు చేస్తున్నారన్న ఆరోపణలు:
రాయగఢ్‌లోని ఒక భవనంలో సామూహిక ప్రార్థనల పేరిట వందమందికి పైగా జనాలను క్రైస్తవ మిషనరీలు పోగు వేసారు. వారికి ఆర్థిక సహాయం చేస్తామని, వారి ఆరోగ్య సమస్యలకు పరిష్కారాలు చూపిస్తామనీ నమ్మబలికారు. దాంతో వారు మతం మారడానికి సిద్ధపడ్డారు. వారిలో అత్యధికులు మహిళలు, చిన్నపిల్లలే ఉన్నారు. అలా ప్రలోభాలతో మతమార్పిడులు చేయడం చట్టవిరుద్ధమంటూ హిందూ సంస్థలు వాదిస్తున్నాయి.
హిందూ సంస్థలు సమాచారం అందిచడంతో 30మంది పోలీసులతో ఒక బృందం ఘటనా స్థలానికి చేరుకుంది. అక్కడికి ప్రార్థన కూటమిలో పాల్గొనడానికి వచ్చిన మహిళలు, పిల్లలను పంపించివేసింది. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అక్కడ మతమార్పిడులు జరుగుతున్నాయని చాలాకాలం నుంచే ఫిర్యాదులు వస్తున్నాయని పోలీసులు చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.