వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారం రోజులుగా వర్రా కోసం ఏపీ పోలీసులు గాలిస్తున్నారు. గత రాత్రి బెంగళూరులో అరెస్ట్ చేసిన పోలీసులు కడపకు తరలించారు. ఇవాళ మధ్యాహ్నం వర్రాను పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశముంది.
వర్రా రవీందర్‌రెడ్డిపై పలు కేసులు నమోదయ్యాయి. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్, హోం మంత్రి అనితపై అసభ్యకర పోస్టులను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కేసులతోపాటు, ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. పులివెందుల నియోజకవర్గానికి చెందిన హరి అనే దళితుడిని దూషించిన దానిపై కేసు నమోదైంది.
వారం కిందటే వర్రాను పోలీసులు విచారించి వదిలేశారు. దానిపై దుమారం రేగడంతో మరలా వర్రా కోసం గాలించి పట్టుకున్నారు. పోలీసు అధికారి సాయంతో వర్రా రాష్ట్ర సరిహద్దులు దాటారనే విమర్శలు వచ్చాయి. దీనిపై ప్రభుత్వం సీరియస్ అయింది. నాలుగు ప్రత్యేక బృందాలు వర్రా కోసం గాలించి ఎట్టకేలకు అరెస్ట్ చేశాయి.
కూటమి ప్రభుత్వంపై వైసీపీ సోషల్ మీడియా వింగ్ చేస్తోన్న అసభ్యకర పోస్టులపై హోంశాఖ కేసులు నమోదు చేస్తోంది. ఇప్పటికే గుంటూరుకు చెందిన బోరుగడ్డ అనిల్ కుమార్‌ను అరెస్ట్ చేయగా, తాజాగా వర్రాను అదుపులోకి తీసుకున్నారు. రాత్రి అశోక్‌రెడ్డి అనే వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టును పోలీసులు అరెస్ట్ చేశారు.వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టులపై ఆ పార్టీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు.