కలియుగ దైవం శ్రీవేంకటేశుడు కొలువైన తిరుమల తిరుపతి దేవస్థానంలో నవంబరు 13న కైశిక ద్వాదశి ఆస్థానం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసింది. స్థితికారుడైన శ్రీమహావిష్ణువును మేల్కొల్పే పర్వదినాన్ని కైశికద్వాదశి అంటారు.
వేంకటతురైవార్, స్నపనబేరంగా పిలిచే ఉగ్రశ్రీనివాసమూర్తికి శ్రీదేవి భూదేవి సమేతంగా కైశిక ద్వాదశి నాడు మాత్రమే సూర్యోదయానికి ముందు మాడవీధుల్లో ఊరేగిస్తారు. పురాణాల ప్రకారం, కైశిక ద్వాదశిని ప్రబోధనోత్సవం, ఉత్తానద్వాదశి అని కూడా పిలుస్తారు.
శ్రీమహావిష్ణువు ఆషాఢశుక్ల ఏకాదశినాడు గాఢ నిద్రలోకి వెళ్ళారు. కైశికద్వాదశినాడు ఆయనను మేల్కొల్పుతారు. శ్రీ వరాహ స్వామి కైశికపురాణంలోని 82 శ్లోకాలతో శ్రీ భూదేవికి కథగా ఈ పర్వదినానే చెప్పారు.
తిరుమలలో ఉగ్రశ్రీనివాసమూర్తి ఊరేగింపు జరుగుతూ ఉండగా సూర్య కిరణాలు స్వామివారిని తాకి మంటలు రేగాయి. దాంతో అప్పటి నుంచి సూర్యోదయానికి ముందే ఊరేగింపు నిర్వహిస్తున్నారు.
ఊరేగింపు తర్వాత ఆలయం లోపల ఉదయం 6 నుంచి ఉదయం 7.30 గంటల వరకు కైశిక ద్వాదశి ఆస్థానాన్ని పురాణ పారాయణం చేస్తారు. దీంతో సాలకట్ల కైశికద్వాదశి ఉత్సవం పూర్తవుతుంది.