పశ్చిమాసియాలో మరోసారి యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. అక్టోబరు 1న ఇజ్రాయెల్‌పై ఇరాన్ 200 రాకెట్లతో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. ఆ దాడిలో నలుగురు ఐడిఎఫ్ సిబ్బంది చనిపోయారు. దాడులను సమర్థంగా తిప్పికొట్టినట్లు ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు ప్రకటించారు. అయితే ఇరాన్‌పై ప్రతీకార దాడులు చేసిన ఇజ్రాయెల్… తీవ్ర హెచ్చరికలు పంపింది. ఇరాన్‌లోని క్షిపణి తయారీ కేంద్రాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ విరుచుకుపడింది. ఆ తరవాత ఇరాన్ చేసిన హెచ్చరికలతో పశ్చిమాసియా మరింత ఉద్రిక్తంగా మారింది.
ఇజ్రాయెల్‌పై దాడికి సిద్దం కావాలంటూ ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ
సైన్యాన్ని ఆదేశించినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. ఏ క్షణంలోనైనా ఇరాన్ ఇజ్రాయల్‌పై యుద్ధానికి సన్నద్ధం కావాలంటూ సుప్రీం లీడర్ ఆదేశాల మేరకు దాడి మొదలు కావచ్చని తెలుస్తోంది.
ఇరాన్ అణ్వాయుధాలు సాధించకుండా నిరోధించడమే లక్ష్యంగా దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు ఇప్పటికే ప్రకటించారు. ఇరాన్ చేతికి అణ్వాయుధాలు చేరితే పెను ప్రమాదానికి దారితీసే అవకాశముందనే ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇరాన్ అణ్వాయుధాలు సమకూర్చుకునేందుకు చేసిన ప్రయత్నాలను అమెరికా కూడా గట్టిగానే వ్యతిరేకిస్తోంది.
పశ్చిమాసియాలో ఏ క్షణంలోనైనా ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడికి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇరాన్ దాడులను తిప్పికొట్టేందుకు ఇజ్రాయెల్ సైన్యం సిద్ధమవుతోంది. ఇజ్రాయెల్‌లోని సైనిక స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ దాడికి దిగే అవకాశముంది.