అమెరికాకు చెందిన సిబిఎన్ న్యూస్ (క్రిస్టియన్ బ్రాడ్‌కాస్టింగ్ నెట్వర్క్) ఛానెల్ అక్టోబర్ 26న ఒక కథనం ప్రసారం చేసింది. తెలంగాణ హైదరాబాద్‌లోని కల్వరి టెంపుల్ నెలకు 3వేలమందికి పైగా హిందువులను క్రైస్తవంలోకి మతం మారుస్తోంది అని వివరించే ఆ కథనం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఆ మెగాచర్చ్ నిర్వాహకుడు సతీష్ ఇప్పటివరకూ మూడున్నర లక్షలమందికి పైగా హిందువులను మతం మార్చానని చెప్పుకున్నాడు. అంతేకాదు, రాబోయే పదేళ్ళలో అటువంటి మరో 40 కల్వరి టెంపుల్స్‌ను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ప్రకటించాడు.
హైదరాబాద్‌లోని కల్వరి టెంపుల్‌కు అనుబంధంగా సతీష్ కుమార్ ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడలో అదే పేరుతో నిర్వహిస్తున్న డిజిటల్ చర్చ్ శాఖను కాకినాడ జిల్లా కలెక్టర్, రెవెన్యూ అధికారులు జప్తు చేసారు. అక్కడ ఎలాంటి కార్యక్రమాలూ నిర్వహించరాదని, ఆ ఉత్తర్వులను అతిక్రమిస్తే శిక్షించబడతారనీ కాకినాడ అర్బన్ తహసీల్దార్ పేరిట ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆ విషయాన్ని అక్టోబర్ 28న ‘లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం’ సంస్థ ఎక్స్ ద్వారా వెల్లడించింది. అయితే ఆ చర్చ్‌ను ఎందుకు మూసివేయించారన్న కారణాలు తెలియరాలేదు. అయితే, హైదరాబాద్ చర్చ్‌కు అనుబంధంగా ఇంకా మరో పది చర్చిలు నడుస్తూనే ఉన్నాయి.
2020 నాటి ఒక వీడియోలో కల్వరి టెంపుల్ పాస్టర్ సతీష్ ప్రభుత్వం తనను గుర్తించకుండా ఎలా తప్పించుకోగలడో సూచనప్రాయంగా చెప్పాడు. అతను మతమార్పిడి, బలవంతపు మతమార్పిడి వంటి పదాలు ఉపయోగించడు, అందువల్ల ప్రభుత్వం అతన్ని పట్టించుకోదు. ‘‘మేము నిరుపేదలకు ఉచితంగా ఆహారం పంచుతున్నందుకు ప్రభుత్వం సంతోషంగా ఉంది’’ అని సతీష్ ఆ వీడియోలో చెప్పాడు. కరోనా మహమ్మారి సమయంలో తాము 700 టన్నుల ఆహారం, మందులు పంచిపెట్టామని సతీష్ చెప్పుకుంటున్నాడు. ఆ గొప్ప సేవ పేరుతో బలహీనులు, అమాయకులైన హిందువులను ఎలా ఆకట్టుకున్నారో ఊహించడం కష్టమేమీ కాదు.
భారత అంతర్గత వ్యవహారాలపై విదేశీయులతో వ్యాఖ్యలు:
ఆ వీడియోలో అప్పటి అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ కూడా ఉన్నారు. పెన్స్‌తో కల్వరి సతీష్ సమావేశమై భారతదేశంలో మత స్వేచ్ఛను కాపాడడం ఎంత ప్రధానమో చర్చించినట్లు ఆ వీడియోలో ఉంది. ఒకపక్క భారత్‌లో తాను అపరిమితమైన మతస్వేచ్ఛను అనుభవిస్తూ లక్షల మందిని మతం మారుస్తున్న సతీష్, విదేశీ నాయకులను కలిసి, వారిని భారత అంతర్గత విషయాలపై వ్యాఖ్యానించేలా చేస్తున్నాడు.
భారతదేశపు అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవడం, ఇక్కడ మతస్వేచ్ఛ గురించి ఆందోళన వ్యక్తం చేయడం అమెరికా దశాబ్దాలుగా చేస్తున్న పనే. ప్రత్యేకించి నరేంద్రమోదీ ప్రధానమంత్రి అయాక అమెరికా రచ్చ మరీ పెరిగింది. ది యునైటెడ్ స్టేట్స్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రెలిజియస్ ఫ్రీడమ్ (యుఎస్సిఐఆర్ఎఫ్) భారతదేశం గురించి ప్రతీయేటా నివేదికలు ప్రచురిస్తూ ఉంటుంది. ప్రస్తుత ప్రభుత్వం, ఈ దేశంలోని హిందువులూ ఇక్కడి మైనారిటీలపై వివక్ష చూపుతున్నారంటూ ఆరోపణలు చేస్తూ ఉంటుంది.
కల్వరి టెంపుల్:
డాక్టర్ సతీష్ కుమార్ 2005లో హైదరాబాద్‌లో కల్వరి టెంపుల్ ప్రారంభించాడు. అతను గౌరవనీయుడైన పాస్టర్, రచయిత, అంతర్జాతీయ వక్త, దార్శనికత కలిగిన నాయకుడు అని అతని శిష్యులు ప్రచారం చేస్తూ ఉంటారు. అయితే అతను చేసే పని ఒక్కటే, హిందువులను ప్రలోభపెట్టి మతం మార్చడమే. కల్వరి సతీష్ బైటకి తానెంతో నిరాడంబరంగా ఉంటాననీ, అందరికీ అందుబాటులో ఉంటాననీ ప్రచారం చేసుకుంటాడు. కానీ అతని పద్ధతులు చూస్తే చాలా కాలిక్యులేటెడ్‌గా ఉంటాయి. మానవత్వం ముసుగులో బలహీనులను బుట్టలో వేసుకుని వారిని తన నియంత్రణలోకి తెచ్చుకోవడంలో కల్వరి సతీష్ దిట్ట.
కల్వరి టెంపుల్ వెబ్సైట్ చూస్తే దాని అభివృద్ధి గురించి ఎన్నో గొప్పలు కనిపిస్తాయి. ఆ టెంపుల్లో 4లక్షల మంది సభ్యులు ఉన్నారట. చర్చ్ అంత వేగంగా విస్తరించడాన్ని పరిశీలిస్తే బలహీన మనస్కులైన హిందువులను లక్ష్యం చేసుకుని ఆకట్టుకోడానికి కావలసిన నిధుల సమీకరణ పద్ధతులు, ఆ నిధులను సమకూర్చే వనరుల వివరాలు ఆందోళన కలిగిస్తాయి. అసలు ఆ చర్చ్‌ని కేవలం 52 రోజుల్లో నిర్మించేసారట. కల్వరి టెంపుల్ పేరిట చర్చి, కల్వరి బైబిల్ కాలేజ్, కల్వరి హాస్పిటల్, ఇంకా ఉచిత ఆహార పథకం వంటివి గమనించినప్పుడు అందులో దానగుణం, వితరణశీలత కంటె మతరాజ్యాన్ని నిర్మించడమే కళ్ళముందు కనిపిస్తుంది.
నెలకు 3వేల మందిని మతం మారుస్తున్న కల్వరి టెంపుల్:
కల్వరి టెంపుల్‌ను గొప్పగా పొగుడుతూ సిబిఎన్ ప్రసారం చేసిన వార్తాకథనంతో ఒక విషయం వెలుగుచూసింది. ఆ మిషనరీ గ్రూప్ కార్యకలాపాలు ఎలా జరుగుతాయన్న విషయాన్ని సిబిఎన్ ఛానెల్ అనుకోకుండా బైటపెట్టేసింది. కల్వరి టెంపుల్ తమది భారతదేశంలోనే అతిపెద్ద చర్చ్ అనీ, మూడు లక్షలకు పైగా సభ్యులు ఉన్నారనీ చెప్పుకుంది. పాస్టర్ సతీష్ కుమార్ నేతృత్వంలో ఆ చర్చ్ ప్రతీనెలా కనీసం 3వేల మంది హిందువులను క్రైస్తవ మతంలోకి మారుస్తున్నట్లు ఆ కథనంలో స్పష్టంగా వెల్లడించారు. క్రైస్తవ మీడియా దాన్ని గొప్ప విజయంగా ఘనంగా ప్రకటించుకుంది. అయితే, సామాన్య హిందువులను ప్రలోభపెట్టి మతమార్పిడి చేసే ఆ చర్చ్ వివాదాస్పద వైఖరిని బట్టబయలు చేసింది.
విశాలమైన ప్రాంగణం, అటెండెన్స్ తప్పనిసరి:
కల్వరి టెంపుల్‌కు హైదరాబాద్‌లో చాలాపెద్ద క్యాంపస్ ఉంది. ప్రతీ ఆదివారం వేలాది మంది హాజరవడానికి అక్కడ ఏర్పాట్లు ఉన్నాయి. ఆదివారం వస్తే చాలు తెల్లవారుజామున 4 గంటల నుంచే ట్రాఫిక్ మొదలైపోతుంది. వాలంటీర్లు ట్రాఫిక్‌ను నియంత్రిస్తూ, క్రిక్కిరిసిన గుంపులు ఉండేలా మేనేజ్ చేస్తూ ఉంటారు. ప్రతీ ఆదివారం తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకూ మొత్తం ఐదు సర్వీస్‌లు ఉంటాయి. చర్చి సభ్యులందరూ ఆదివారం ప్రార్థన కూటములకు తప్పకుండా హాజరు కావలసిందే. దానికోసం వారికి డిజిటల్ అటెండెన్స్ విధానం కూడా ఉంది. ఆదివారం ప్రార్థనలకు హాజరవని వారికి వెంటనే ఫోన్‌కాల్ వెళ్ళిపోతుంది. చర్చ్‌కు ఎందుకు రాలేదని వాకబు చేస్తారు.
వితరణ పేరిట బలహీనుల దోపిడీ:
కల్వరి టెంపుల్ నిర్వాహకులు మతమార్పిడుల కోసం బలహీనులైన హిందువులను లక్ష్యం చేసుకుంటారు. ఆర్థికంగా స్థిరత్వం లేని, పేదరికంలో కొట్టుమిట్టాడే దుర్బలురైన హిందువులను వితరణ పేరుతో ఆకట్టుకుని, మతం మార్చేస్తారు. ప్రతీ ఆదివారం చర్చి సర్వీస్‌కు హాజరయ్యే ప్రతీ ఒక్కరికీ మూడు పూటలా భోజనాలు పెడతారు. అలా ఒక ఆదివారం కనీసం 50వేల మంది భోజనం చేస్తారు. అంటే నెలకు 2లక్షల మందికి ఉచితంగా భోజనం పెడతారు. దానికితోడు ఉచిత వైద్యసేవలు, పెళ్ళి ఏర్పాట్లు, చనిపోయిన వారి అంత్యక్రియలూ ఇలా ప్రతీ విషయంలోనూ తమ ‘సేవలు’ అందిస్తారు. అవన్నీ నిజానికి హిందువులను మతం మార్చడానికి కచ్చితమైన పథకం ప్రకారం చేసే పనులే.
హిందువుల వితరణకూ, కల్వరి వితరణకూ తేడా:
నిజానికి వేలాది హిందూ దేవాలయాలు, సంస్థలు ఇలాంటి సేవలెన్నో అందిస్తాయి. దాదాపు ప్రతీ పెద్ద గుడిలోనూ సంవత్సరం పొడుగునా మూడుపూటలా ఉచిత అన్నప్రసాదం పెడతారు. కానీ వారెవరూ మతమార్పిడి చేయరు. సమాజానికి హిందూ దేవాలయాలు, సంస్థలు నిస్వార్థంగా సేవలందించినా హిందూసమాజంలో కులవివక్ష ఉందన్న విమర్శలే ఎక్కువగా ఉంటాయి. ఒక్క ఆదివారం మాత్రమే తెరిచి ఉండే కల్వరి చర్చి వంటశాల మాత్రం సమాజానికి అద్భుతమైన సేవలు అందిస్తోందంటూ ప్రశంసిస్తూ ఉంటారు.
జాతీయ, అంతర్జాతీయ విస్తరణ ఆకాంక్షలు:
కల్వరి టెంపుల్ చర్చ్ ఇప్పటికే హైదరాబాద్ చర్చ్‌కు అనుబంధంగా 11 శాటిలైట్ చర్చ్‌లు మొదలు పెట్టింది. వచ్చే పదేళ్ళలో భారతదేశంలో అటువంటి 40 మెగాచర్చ్లు నిర్మించడమే తమ ప్రణాళిక అని సతీష్ చెబుతున్నాడు. భారతదేశంలోనూ, వెలుపలా కూడా హిందువులు, ఇతర మతాలకు చెందిన వారిని ‘చేరుకోవడమే’ తమ లక్ష్యమని సతీష్ స్పష్టంగా ప్రకటిస్తున్నాడు. విదేశీ క్రైస్తవ సంస్థల ప్రభావంతో సాగుతున్న ఈ విస్తరణ ధోరణి వల్ల భారతదేశపు మత వైవిధ్యం మనుగడ గురించి తీవ్రమైన ఆందోళనలు రేకెత్తిస్తోంది. ఇంక ఈ చర్చ్ దాదాపు అన్ని భారతీయ భాషల్లోనూ టెలివిజన్ కార్యక్రమాలు రూపొందించి ప్రసారం చేస్తోంది. అవి కేవలం భారత్‌లోనే కాక దక్షిణాసియా, గల్ఫ్ దేశాల్లోని కోట్లాది మందికి చేరుతున్నాయి.
సభ్యుల ట్రాకింగ్ విధానం:
కల్వరి చర్చ్ అనుసరించే విధానాల్లో అత్యంత సమస్యాత్మకమైనది దాని ట్రాకింగ్ విధానం. చర్చ్ సభ్యులు అందరికీ యాక్సెస్ కార్డులు ఉంటాయి. ఆదివారం ప్రార్థనకు వారు యాక్సెస్ కార్డుతో హాజరు నమోదు చేసుకోవాలి. దాని ద్వారా ఎవరు హాజరవడం లేదో ట్రాక్ చేయడం సులువు అవుతుందని, ప్రార్థనకు హాజరుకాని వారితో మాట్లాడడం సులువు అవుతుందనీ చర్చ్ బైటకు చెబుతోంది. అయితే ఒక మతపరమైన కార్యక్రమానికి హాజరయ్యే వారిపై ఆ స్థాయిలో నిఘా పెడుతుండడాన్ని ప్రభుత్వం పట్టించుకోవాలి. ఆ చర్చి చొరబాటు ధోరణి, సభ్యుల మీద చర్చి చూపే ప్రభావం, వారిని నియంత్రించే విధానాలూ ఆందోళనకరమైనవి.
మతహింస పేరిట తప్పుడు ప్రచారం:
కల్వరి చర్చ్ కేవలం క్రైస్తవ మతాన్ని ప్రచారం చేసుకోవడం లేదు, హిందూమతంపై దుష్ప్రచారం విస్తృతంగా చేస్తోంది. ‘హిందూ అతివాద శక్తులు’ క్రైస్తవులపైన చేస్తున్న దాడులు పెరిగిపోయాయంటూ తప్పుడు ఆరోపణలు చేస్తోంది. హిందూసంస్థలపైన ఇలా బురద చల్లడానికి ప్రధాన కారణం… ఉచిత భోజనాలు, వైద్యం వంటి ప్రలోభాలతో, మహిమలు జరుగుతున్నాయని వంచించడంతో కల్వరి చర్చ్ చేస్తున్న మతమార్పిడులను ఆపడానికి ఆ సంస్థలు ప్రయత్నాలు చేస్తూండడమే. మతమార్పిడులను నిలువరించడానికి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ వంటి హిందూ సంస్థలు విస్తృతంగా చేస్తున్న ప్రయత్నాలు ఫలితాలనిస్తూండడం ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ మిషనరీలకు ఆందోళన కలిగిస్తోంది.
కల్వరి చర్చ్ నిర్మాణానికి నిధులెక్కడివి?:
‘హ్యాండ్‌బుక్ ఆఫ్ మెగా చర్చెస్’ అనే పుస్తకంలో ‘‘గ్లోబల్, గ్లోకల్ అండ్ లెకల్ డైనమిక్స్ ఇన్ కల్వరి టెంపుల్ : ఇండియాస్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ మెగాచర్చ్’’ అనే అధ్యాయం ఉంది. అందులో కల్వరి చర్చ్ విస్తరణ గురించి ఉంది. 2005లో కల్వరి టెంపుల్ మొదలుపెట్టాక సతీష్ దేశంలోనే పెద్ద చర్చి కట్టాలని భావించాడు. కానీ పరిస్థితులు అనుకూలించలేదు. 2015లో సతీష్ నిధుల సమీకరణ కోసం అమెరికా వెళ్ళాడు కానీ పెట్టుబడులు ఏమీ రాలేదు. అయితే పీటర్ స్పెన్సర్ తన రచన ‘’52 డే మిరాకిల్’’ అనే పుస్తకంలో, కల్వరి టెంపుల్ సభ్యుల విరాళాలతో చర్చ్ నిర్మాణం జరిగిందని రాసుకొచ్చాడు. అందులో అతను ప్రస్తావించని విషయం ఏంటంటే… సతీష్ కుమార్ పీటర్ స్పెన్సర్‌ను అమెరికాలో కలిసినప్పుడు స్పెన్సర్ అతనికి భవన నిర్మాణం కోసం ఆర్థిక సహాయం చేస్తానని హామీ ఇచ్చాడు. కల్వరి టెంపుల్ ప్రాజెక్టుకు ఫండింగ్ పీటర్ స్పెన్సర్ చేసాడా లేక మరే ఇతర వనరుల నుంచి నిధులు అందాయా అన్న విషయం ఇప్పటికీ అస్పష్టమే.
కల్వరి టెంపుల్ వెబ్సైట్లో ఆ చర్చికి వచ్చే నిధుల వివరాలు లేవు. అయితే యుకె కేంద్రంగా పనిచేసే క్రిస్టియన్ విజన్ అనే సంస్థ నుంచి రెండుసార్లు పెద్దమొత్తంలో నిధులు సమకూరినట్లు వివరాలు లభిస్తున్నాయి. 2020లో సుమారు 74,467 పౌండ్లు, 2021లో ఏకంగా 7,27,394 పౌండ్లు కల్వరి టెంపుల్‌కు క్రిస్టియన్ విజన్ సంస్థ నుంచి నిధులు వచ్చాయి. అయితే కల్వరి టెంపుల్ ఇండియా సంస్థకు ఎఫ్సిఆర్ఎ లైసెన్స్ ఉందో లేదో స్పష్టత లేదు.
బలవంతపు మతమార్పిడులపై పెరుగుతున్న ఆందోళనలు:
కల్వరి టెంపుల్ భారతదేశం అంతటా విస్తరించాలని భారీ ప్రణాళికలు వేస్తోంది. వచ్చే పదేళ్ళలో దేశంలో 40 మెగా చర్చ్‌లు నిర్మిస్తామని కల్వరి సతీష్ చెబుతున్నాడు. ఆ చర్చ్‌ల మతమార్పిడుల వల్ల దేశంలో మతసామరస్యం పై పడే ప్రభావం గురించి ఆందోళనలు పెరుగుతున్నాయి. కల్వరి చర్చ్ విస్తరణ కార్యక్రమాలు, బలవంతపు మతమార్పిడి కార్యక్రమాలు, నిరుపేదల ఆర్థిక అవసరాలను వాడుకుని వారిని మతం మార్చే కార్యక్రమాల మీద ప్రభుత్వం పూర్తిస్థాయి దర్యాప్తు జరిపించి, వాటిని నిలువరించడం తక్షణావసరం.