హెజ్బొల్లా ఉగ్ర సంస్థకు కొత్త చీఫ్‌ను ఎన్నుకున్నారు. ఇప్పటి వరకు ఈ ఉగ్రవాద సంస్థకు డిప్యూటీ కమాండర్‌గా ఉన్న నయీం ఖాసింను హొజ్బొల్లాకు అధిపతిగా ఎన్నుకున్నారు. ఇటీవల ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఆ సంస్థ చీఫ్ హసన్ నస్రల్లా హతమైన సంగతి తెలిసిందే. ఆ తరవాత అతని సమీప బంధువు హసీమ్ హెజ్బొల్లా పగ్గాలు చేపడతారని అందరూ భావించారు. ఇజ్రాయెల్ సైన్యం జరిపిన దాడుల్లో అతను కూడా చనిపోవడంతో నయీంను ఎన్నుకున్నట్లు తెలుస్తోంది.
హెజ్బొల్లా ఉగ్రవాద సంస్థకు నయీం ఖాసిం అధిపతి కావడంతో అతని గురించి చర్చ మొదలైంది. హొజ్బొల్లాలో మూడు దశాబ్దాల పాటు ప్రణాళికలు రచించి అమలు చేయడంలో ఆరితేరిన నయీం అధిపతి అయ్యారు. ఇటీవల ఇజ్రాయెల్‌తో సంధి ప్రస్తావన తీసుకువస్తూనే, లెబనాన్‌పై దాడులు ఆపకుంటే టెల్‌అవీవ్‌పైనే దాడులు చేస్తామంటూ హెచ్చరించారు.
కాల్పుల విరమణకు నయీం చొరప చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందుకు లెబనాన్ పార్లమెంట్ చేసిన ప్రతిపాదనను ఆయన అంగీకరించారు. ఇజ్రాయెల్ దాడులు ఆపితే కాల్పుల విరమణకు ముందుకు వస్తామంటూ ప్రతిపాదనలు పంపారు. అయితే వారి షరతులకు ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు అంగీకరిస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది.
తాజాగా ఇజ్రాయెల్ సైన్యం పాలస్తీనాపై జరిపిన దాడుల్లో 53 మంది చనిపోయారు. వందలాది మంది గాయపడ్డారు. హమాస్ ఉగ్రవాదుల స్థావరాలే లక్ష్యంగా దాడులు కొనసాగిస్తోన్నట్లు ఐడిఎఫ్ ప్రకటించింది. పౌరుల శిబిరాల్లో హమాస్ ఉగ్రవాదులు ఆశయం పొందుతున్నారని అందుకే ఆ ప్రాంతాల్లోనూ దాడులు చేస్తున్నట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇటీవల హమాస్ రహస్యంగా ఏర్పాటు చేసుకున్న పలు భారీ సొరంగాలను ఐడీఎఫ్ ధ్వంసం చేసింది.