దీపావళి పండుగ సమయంలో తీపిమిఠాయిలు పంచుకోవడం ఉత్తరభారతదేశంలో విశేష ప్రాచుర్యం కలిగిన ఆచారం. ఆ సమయంలో మిఠాయిల విక్రయాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఆ అవకాశాన్ని వాడుకోవడం కోసం రవాణా చేస్తున్న కల్తీ సరుకులను మధ్యప్రదేశ్ అధికారులు పట్టుకున్నారు.
ఉజ్జయిని జిల్లా ఆహార భద్రతా విభాగం అధికారులు శుక్రవారం ఉదయం గుజరాత్‌లోని అహ్మదాబాద్ నగరం నుంచి ఉజ్జయినికి సరఫరా అవుతున్న కల్తీ కోవాను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన సొత్తు 300 కేజీల పైగా బరువుంది. దాన్ని బస్ పార్సెల్‌లో పంపించారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు తమకు అందిన సమాచారం మేరకు జిల్లాలోని దేవాస్ గేట్ బస్టాండ్ దగ్గర శుక్రవారం ఉదయం 7 గంటలకల్లా కాపు కాసారు. బస్సును ఆపాక కల్తీ కోవాను అధికారులు పట్టుకున్నారు.
జిల్లా ఆహార భద్రత అధికారి బసంత్ దత్ మాట్లాడుతూ ‘‘దీపావళి పండుగ వస్తున్న సందర్భంగా మేం కల్తీ వస్తువులను గుర్తించి జప్తు చేస్తున్నాం. ఈ ఉదయం మాకు సమాచారం వచ్చింది. కల్తీ కోవా బస్సులో వస్తోందని, దాన్ని చవక ధరలకు అమ్మేందుకు ప్రయత్నిస్తారనీ మాకు తెలిసింది. ఈ ఉదయం మేము చేరేసరికి అక్కడ కొందరు అనుమానితులు ఉన్నారు. వారిలో ఒకరిని నేను గుర్తించాను. బస్సు నుంచి పాలకోవా దించుకోగానే దాన్ని జప్తు చేసాం. మొత్తం 300 కేజీల కోవాను పది సంచుల్లో సర్ది తీసుకొచ్చారు’’ అని జిల్లా ఆహార అధికారులు వెల్లడించారు.
నిందితుణ్ణి గుర్తు పట్టారు. అతని పేరు ప్రవీణ్ జైన్. విద్యాపతి నగర్‌లో నివసిస్తున్నాడు. అతనికి ఫుడ్ లైసెన్స్ లేదు, కనీసం దుకాణమైనా లేదు. నిందితుల విచారణ క్రమంలో మరిన్ని వివరాలు తెలుస్తాయని ఆశాభావం వ్యక్తం చేసారు.