ఉత్తరాఖండ్‌లోని ఓ గిరిజన తెగ థరూ బుక్సా. ఆ తెగ ప్రజలు మహారాణా ప్రతాప్ వంశీకులని చెప్పుకుంటుంటారు. ఇప్పుడు ఆ తెగలో దాదాపు 40శాతం మంది క్రైస్తవంలోకి మతం మార్పిడి అవడం స్థానికంగా ఆందోళన కలిగిస్తోంది. నేపాల్ సరిహద్దుల్లో ఉండే ఖాతిమా, సితార్‌గంజ్, నానక్‌మాఠా నియోజకవర్గాల్లో నివసించే థరూ బుక్సా తెగ ప్రజ క్రైస్తవ మిషనరీల మాయలో పడిపోయారు. థరూ బుక్సా తెగకు చెందినవారు శతాబ్దాల క్రితం మొగలుల ఊచకోత నుంచి తప్పించుకునేందుకు ఈ ప్రాంతానికి వచ్చి స్థిరపడ్డారు. కాలక్రమంలో వారికి చట్టపరంగా గిరిజన హోదా లభించింది. స్వతంత్రానంతరం వారికి ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కూడా లభిస్తున్నాయి. వారిని మతం మార్చేందుకు క్రైస్తవ మిషనరీలు చేసిన ప్రయత్నాలు చాలావరకూ ఫలించాయనే చెప్పవచ్చు. అందుకే ఆ తెగలో సుమారు 40శాతం మంది మతమార్పిడి చెందారు.
క్రైస్తవ మిషనరీల ప్రభావం ఈ ఒక్క తెగకుమాత్రమే పరిమితం కాలేదు. ఉత్తరాఖండ్‌లోని ఇతర ప్రాంతాల్లో ఉన్న సిఖ్ఖులు, జవున్‌సరీ తెగల్లోకి కూడా పాకుతోంది. దేశానికి స్వతంత్రం వచ్చిననాటినుంచీ ఆ ప్రాంతాల్లో క్రైస్తవ మిషనరీల ప్రభావం గణనీయంగా ఉంది. మిషనరీలు మొదట చదువు చెబుతాం, వైద్యసేవలు అందిస్తాం అనే సాకుతో గిరిజన ప్రదేశాల్లోకి ప్రవేశించారు. క్రమంగా తమ ప్రభావాన్ని వ్యాపింపజేసారు. ఇక్కడ మతమార్పిడుల వ్యవహారం వెనుక పెద్ద కుట్రే ఉంది. ఉత్తరాఖండ్‌లోని ఆ ప్రాంతం నేపాల్ సరిహద్దులకు దగ్గరగా, వ్యూహాత్మకంగా కీలకమైన స్థానంలో ఉంది. చరిత్రపూర్వకాలం నుంచీ పెద్దగా అభివృద్ధికి నోచుకోని ప్రాంతమది. అక్కడ క్రిస్టియన్ మిషన్‌లు పాఠశాలలు పెట్టాయి, వైద్యసౌకర్యాలు ఏర్పాటు చేసాయి. ఆ విధంగా స్థానిక ప్రజల చుట్టూ జాగ్రత్తగా సాలెగూడు అల్లాయి. చక్కటి విద్యావసతులు, మెరుగైన సామాజిక పరిస్థితులు కల్పిస్తామనే ఆశ చూపించి గిరిజన కుటుంబాలను క్రైస్తవంలోకి మతం మారుస్తున్నారు.
నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చాక మిషనరీ కార్యకలాపాలకు విదేశీనిధులకు అడ్డుకట్ట పడింది. దాంతో ఈ మతమార్పిడి ముఠాలు ప్రత్యామ్నాయ పద్ధతుల్లో తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయని తెలుస్తోంది. ఉదాహరణకి, మిషనరీ పాఠశాలల్లో చదివే డబ్బున్న హిందూ విద్యార్ధులకు ఫీజులు పెంచేసి, ఆ నిధులను మతమార్పిడులకు ఉపయోగిస్తున్నారు. అలా, హిందువుల నుంచి వసూలు చేసిన డబ్బులనే ఉపయోగించి మతమార్పిడి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.
మిషనరీలు తమ వ్యూహాలను మార్చి కొత్తకొత్త పద్ధతుల్లో హిందువులను ప్రభావితం చేస్తుండడం, వారి మతమార్పిడుల క్రమంలో మరింత ఆందోళన కలిగిస్తున్న అంశం. ఇప్పుడు నన్‌లు తెల్లని దుస్తుల్లోనూ పాస్టర్లు పాశ్చాత్య దుస్తుల్లోనూ వచ్చి మతమార్పిడి కార్యకలాపాలు చేపట్టడం తగ్గింది. దానికి బదులు వారు స్థానిక ప్రజల వేషభాషల్లోకి మారిపోతున్నారు. స్థానిక ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలను క్రైస్తవీకరిస్తున్నారు. తద్వారా తామే అసలైన స్థానికులమనేలాంటి ప్రభావం కలిగేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చర్చిలను ఆ పేరుతో పిలవకుండా ప్రార్థనామందిరాలు అనో, ఆశ్రమాలు అనో పిలుస్తున్నారు. తద్వారా స్థానిక ప్రజల మతపరమైన పలుకుబడుల్లోకి చొరబడుతున్నారు. ఇంక హిందువులకు, సిఖ్ఖులకు బాగా అలవాటైన చిహ్నాలను, ఆచారాలనూ ఉపయోగిస్తూ అవి క్రైస్తవంలోనివే అని భ్రమ కలిగేలా చేస్తున్నారు.
సిఖ్ఖులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో క్రైస్తవ మిషనరీలు పాస్టర్లను సంప్రదాయ సిఖ్ఖు వస్త్రధారణలో పంపిస్తున్నారు. అంటే ఆ పాస్టర్లు తలపాగాలు చుట్టుకుని, కృపాణాలు ధరించి ఉంటారు. దానివల్ల వారి ప్రభావాన్ని పసిగట్టడం చాలా కష్టమవుతుంది. వారి పేర్లు హిందూ పేర్లే ఉంటాయి, కానీ వారు హిందూ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొంటూ ఉంటారు. ఉదాహరణకు జవున్‌సర్ ప్రాంతంలో ఇటీవల సుందర్‌సింగ్ చౌహాన్ అనే స్థానిక యువకుణ్ణి క్రైస్తవంలోకి మతమార్పిడి చేసారు. తర్వాత అతన్నే పాస్టర్‌గా నియమించారు. ఇప్పుడు అతను ఆ ప్రాంతంలోని స్థానిక ప్రజలను మతం మార్చడంలో క్రియాశీలంగా పనిచేస్తున్నాడు. పేరు, వేషభాషల్లో ఏ మార్పూ లేకపోవడంతో స్థానికులను బుట్టలో పడేయడం అలాంటివారికి చాలా సులువు అవుతోంది. ఇప్పుడు ఆ ప్రాంతానికి చెందిన జానపద గాయకులు సైతం క్రిస్టియన్ మిషనరీల కిందే పనిచేస్తున్నారు.
ఇంటలిజెన్స్ నివేదికల ప్రకారం కొన్ని క్రైస్తవ సంస్థలు, ఆస్పత్రులు మిషనరీ కార్యకలాపాలకు కేంద్రస్థానంగా వెలిసాయి. ఉదాహరణకు హల్ద్వానీ ప్రాంతంలోని గ్రామీణ ఆస్పత్రి, హెర్బర్ట్‌పూర్ ఆస్పత్రి వంటి చోట్ల మతమార్పిడులు నిత్యకృత్యంగా మారాయి. నైనిటాల్‌లో సట్టాల్ ఆశ్రమం పేరుతో నడుస్తున్నది నిజానికి మెథడిస్ట్ చర్చ్. ఆ ప్రాంతంలో మతమార్పిడి ప్రచారాలను ఆశ్రమం పేరుతోనే జరుపుతోంది.
సితార్‌గంజ్‌లో రమేష్ కుమార్ అనే యువకుణ్ణి మతమార్పిడి చేసారు. ఇప్పుడు అతని పేరు రమేష్ మాసే. అతన్ని క్రైస్తవ మిషన్‌లో క్రమంగా పెంచి, ఇప్పుడొక ప్రముఖ పాస్టర్‌ని చేసారు. అతను ఇటీవల రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికల్లో సైతం పోటీ చేసాడు. ఆ ప్రాంతంలో మతమార్పిడులు జరిపిస్తున్న ప్రధానవ్యక్తి అతడే. ఆ ప్రాంతంలో రాణా అనే గిరిజన తెగ జనాభా ఎక్కువ. ఆ తెగకు చెందిన డాన్‌సింగ్ రాణా, గోపాల్ రాణా అనే ప్రధానమైన వ్యక్తులను మతమార్పిడి చేసారు. వారిద్వారా ఆ తెగలో మతమార్పిడులు విస్తృతంగా జరుగుతున్నాయి. ఝాఝ్రా ప్రాంతంలో డాక్టర్ చందన్ అనే పాస్టర్ బాగా పాపులర్ అయ్యాడు. క్రైస్తవ విశ్వాసాన్ని ప్రచారం చేయడంలో అతనిది ముఖ్యమైన పాత్ర.
విదేశాల నుంచి వచ్చే నిధులు తగ్గిపోయినప్పటికీ, ఇలాంటి చర్యల ద్వారా మిషనరీలు సమాజానికి సవాల్ విసురుతున్నారు. ప్రత్యేకించి గిరిజన ప్రాంతాలు ఎక్కువ ఉండే ఉత్తరాఖండ్‌లో మిషనరీల ముప్పు రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. థరూ బుక్సా తెగలో 40శాతం కంటె ఎక్కువమందే ఇప్పటికే అమ్ముడుపోయారు. దాంతో అలాంటి తెగల సాంస్కృతిక, మతపరమైన ఉనికి ప్రమాదంలో పడిందని స్థానిక ప్రజలు, నాయకులు అర్ధం చేసుకోవాలి. సిఖ్ఖు, హిందూ సంప్రదాయాల్లో క్రైస్తవ బోధనలను కలిపేసి పరిస్థితిని మరింత సంక్లిష్టంగా మారుస్తున్నారు.
పంజాబ్‌కు ఆవల సిఖ్ఖు జనాభా ఎక్కువ ఉన్న ప్రాంతం తెరాయ్. అక్కడ క్రైస్తవ మిషనరీలు తమ ప్రయత్నాలను ముమ్మరం చేసారు. ప్రత్యేకించి రజిఖ్ సిఖ్ తెగ అనే ఎస్‌టి తెగ మీద క్రైస్తవ మిషనరీలు దృష్టి సారించారు. అది ఆందోళన కలిగిస్తోంది. మామూలుగా ఆ ప్రాంతానికి సిఖ్ఖు మతంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అక్కడే సిఖ్ఖు మతస్తులకు పవిత్రమైన నానక్‌మట్టా సాహిబ్ గురుద్వారా ఉంది. అందుకే క్రైస్తవ మిషనరీలు ఆ ప్రాంతాన్ని, రజిఖ్ సిఖ్ తెగనూ లక్ష్యం చేసుకున్నారు. సిఖ్ఖులు దీర్ఘకాలంగా తమ ధర్మం, తమ విశ్వాసాన్నే అనుసరిస్తున్నప్పటికీ క్రైస్తవ మిషనరీలు వారిలోకి చొరబడిపోయారు. తరు, రాయిఖ్ తెగలకు చెందిన సిక్కుల వేషధారణలో వారిని మిషనరీ కేంద్రాలకు రప్పించేలా ఆదివారం ప్రార్థనల పేరిట ఆకట్టుకుంటున్నారు.
సితార్‌గంజ్‌లో మత మర్పిడులు చేసే కేంద్రం పేరు అనుగ్రహ ఆశ్రమం. అక్కడ ప్రతీ ఆదివారం ప్రార్థనా సమావేశాలు నిర్వహిస్తారు. వాటికి థరు, రయీఖ్ తెగలకు చెందిన సిఖ్ఖులు వస్తూంటారు. వారి అమాయకత్వాన్ని, బలహీనతలనూ అడ్డం పెట్టుకుని మతమార్పిడి చేస్తుంటారు. వారికి ఆర్థికంగా సహాయం చేయడం, కుటుంబానికి అవసరమైన నిత్యావసరాలను అందజేస్తూ, గంటల తరబడి ప్రార్థనలు చేయిస్తూంటారు. వారి జీవితంలో వచ్చే ప్రతీ సమస్యకూ పరిష్కారం ఏసుక్రీస్తేనని నమ్మబలుకుతారు. పిల్లలను సైతం వదిలిపెట్టరు. వారికి విద్యాసంస్థల్లో క్రైస్తవ విలువలతో కూడిన చదువే అందుతూ ఉంటుంది. పుస్తకాలు, ఇతర సామగ్రి, ఆఖరికి ఆన్‌లైన్ చదువుల కోసం అంటూ మొబైల్ ఫోన్లు కూడా సమకూరుస్తారు. ఉచిత విద్య పేరిట ఏసుక్రీస్తు జీవిత కథలు, బైబిలు కథలు నేర్పిస్తూ భవిష్యత్తులో పిల్లలను మతం మార్చడానికి క్షేత్రస్థాయి కార్యక్రమాలు అమలుచేస్తూ ఉంటారు. వారిలో చాలామంది పిల్లలు ఉన్నతవిద్యకు వచ్చేసరికల్లా క్రైస్తవ విశ్వాసానికి అనుగుణంగా పూర్తిగా మారిపోయి ఉంటారు.
నేపాల్ సరిహద్దులకు చేరువలోని ఖాతిమా నియోజకవర్గ ప్రాంతంలో అమావ్ చర్చి కార్యకలాపాలు బాగా పెరిగాయి. భారత్ నేపాల్ మధ్య తిరగడానికి ఎలాంటి ఆటంకాలూ ఉండవు. దాన్ని ఆసరా చేసుకుని ఆ మిషనరీ సంస్థ అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది. నేపాల్‌లో మావోయిస్టుల తిరుగుబాటు తర్వాతి పరిణామాల్లో భారత నేపాల్ సరిహద్దుల వెంబడి రన్‌సలీ, కడపనీ వంటి అటవీ గ్రామాల్లోకి క్రైస్తవ మిషనరీలు చొరబడ్డారు.
మిషనరీల నెట్‌వర్క్ ఉత్తరాఖండ్‌లోని మరిన్ని ప్రాంతాలకు విస్తరించింది. మొహమ్మద్‌పూర్ భూడియా, లోహియాపుల్, ఉమ్రకలా, ఫులయ్యా, మజ్‌హోలా, పోలీగంజ్ వంటి గ్రామాల్లో వారి కార్యకలాపాల ఎక్కువగా జరుగుతున్నాయి. కానీ వాటిని పసిగట్టడం చాలా కష్టం. మిషనరీలు స్థానిక మురికివాడల్లో ప్రార్థనాకేంద్రాలు ఏర్పాటు చేస్తారు. విచిత్రం ఏంటంటే వాటికి ఎలాంటి డాక్యుమెంటేషన్ ఉండదు. అందువల్ల మతమార్పిడులు జరుగుతున్నాయని చట్టపరంగా నిరూపించడం అసాధ్యం. ఇప్పుడు తాజా ట్రెండ్ ప్రకారం మతమార్పిడి తర్వాత పేర్లు మార్చడం లేదు. అందువల్ల మతం మారినవారు సైతం గిరిజనులకు, ఇతర హిందూ రిజర్వేషన్ తరగతులకు అందాల్సిన చట్టపరమైన రక్షణలను పొందుతూ, వారి అవకాశాలకు గండి కొడుతున్నారు.
ఇంటలిజెన్స్ సమాచారం ప్రకారం, క్రైస్తవ మిషనరీలు ఉత్తరాఖండ్‌లో నివసించే పేద నేపాలీ ప్రజలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. అలా, కొత్తగా మతమార్పిడి చెందిన వ్యక్తుల ద్వారా మిషనరీల ప్రాబల్యం పొరుగుదేశమైన నేపాల్‌లోకి సైతం చొరబడుతోంది. ఈ కార్యకలాపాలన్నీ ఖాతిమా, సితార్‌గంజ్ ప్రాంతాల నుంచి సమన్వయం చేస్తున్నారు. మతమార్పిడులు జరుగుతున్నది సరిహద్దులకు ఇవతలా లేక అవతలా అన్నది మరింత సంక్లిష్ట సమస్యగా మారుతోంది.
స్థానికంగా ప్రముఖుడైన అడ్వొకేట్ అమిత్ రస్తోగీ ఈ కొత్త తరహా ట్రెండ్ గురించి ఆందోళన వ్యక్తం చేసారు. థరూ బుక్సా తెగవారు గిరిజనులుగానే కొనసాగుతుంటారు, తద్వారా క్రైస్తవంలోకి మారిన తర్వాత కూడా రిజర్వేషన్లు, ఇతర ప్రభుత్వ లబ్ధి పొందుతూ ఉంటారు. అది చట్టాన్ని, మైనారిటీ హోదానీ రెండింటినీ మోసం చేసి దోచుకోవడమే. ఉత్తరాఖండ్‌లో 2018 మతమార్పిడుల వ్యతిరేక చట్టానికి పదును పెట్టారు, ఆ తర్వాత 2024 బిల్లులో మరిన్ని కఠినమైన అంశాలనూ చేర్చారు. మతమార్పిడికి పాల్పడినట్లు నిరూపణ అయితే వారికి గిరిజనులకుండే హక్కులను తొలగించవచ్చు, వారికి జైలుశిక్ష లేదా భారీ జరిమానా వేయవచ్చు అని రస్తోగీ చెప్పారు.