హసన్ నస్రల్లా తర్వాత హెజ్బల్లా చీఫ్‌గా నియమితుడైన హషీమ్ సఫిద్దీన్‌ను హతమార్చింది తామేనని ఇజ్రాయెల్ సైన్యం ధ్రువీకరించింది. హషీమ్ సఫిద్దీన్ మూడువారాల క్రితం బీరూట్ శివార్లలో ఒక దాడిలో హతమయ్యాడు.
ఇజ్రాయెల్ సైన్యం తాజాగా విడుదల చేసిన ఒక ప్రకటనలో ‘‘సుమారు మూడు వారాల క్రితం చేసిన ఒక దాడిలో హెజ్బొల్లా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అధినేత హషీమ్ సఫిద్దీన్, హెజ్బొల్లా ఇంటలిజెన్స్ డైరెక్టరేట్ అధినేత అలీ హుసేన్ హజీమా మరికొందరు హెజ్బొల్లా కమాండర్లు హతమయ్యారని నిర్ధారణ అయింది’’ అని వెల్లడించింది. ఆ ప్రకటన గురించి హెజ్బొల్లా ఇంకా ఏమీ స్పందించలేదు.
ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు అక్టోబర్ 8న తమ సైన్యం సఫిద్దీన్‌ను తుదముట్టించిందని, అతని పేరు ప్రస్తావించకుండా చెప్పారు.
లెబనాన్ ప్రజలను ఉద్దేశించి ఒక ప్రకటన చేస్తూ నెతన్యాహు ‘‘ఇజ్రాయెల్ బలగాలు వేలాది మంది ఉగ్రవాదులను తుడిచిపెట్టేసాయి. హెజ్బొల్లా నాయకుడు నస్రల్లాను, అతని తర్వాత వచ్చిన నాయకుడిని, ఆ రెండో వ్యక్తి తర్వాత వచ్చిన నాయకుణ్ణి సైతం హతమార్చాయి’’ అని చెప్పారు.
ఆ విషయాన్ని నిన్న మంగళవారం రాత్రి ఇజ్రాయెల్ సైన్యం ధ్రువీకరించింది. ‘‘మూడు వారాల క్రితం బీరూట్ దక్షిణ శివారులోని దహియే వద్ద హెజ్బొల్లా ఇంటలిజెన్స్ ప్రధాన కార్యాలయం మీద ఇజ్రాయెల్ వైమానిక దళం నిఘా విభాగపు సమాచారంతో కచ్చితమైన దాడి చేసింది. ఆ సమయంలో ఆ భవనంలో 25మందికి పైగా హెజ్బొల్లా ఉగ్రవాదులు ఉన్నారు. వారిలో ఏరియల్ ఇంటలిజెన్స్ ఇన్‌ఛార్జ్ బిలాల్ సాయిబ్ ఆయిష్ కూడా ఉన్నాడు’’ అని ఇజ్రాయెల్ ఆర్మీ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ హెర్జీ హలేవీ వెల్లడించారు.
నస్రల్లాకు దూరపు బంధువు, నస్రల్లా తర్వాత హెజ్బొల్లా చీఫ్ అయిన సఫిద్దీన్ ఆ దాడి తర్వాత నుంచీ ఎవరికీ కాంటాక్ట్‌లో లేడు. సఫిద్దీన్ హెజ్బొల్లాను పూర్తిగా సమర్ధించే ఇరాన్‌కు అత్యంత సన్నిహితుడు కూడా.