తమిళనాడులోని రాజకీయ పార్టీ విడుదలై చిరుత్తైగళ్ కచ్చి (విసికె) అధ్యక్షుడు, చిదంబరం నియోజకవర్గం నుంచి ఎంపీ అయిన తొళ్ తిరుమావళవన్ కొత్త వివాదానికి దారి తీసాడు. హమాస్, హెజ్బొల్లా, హుతీ వంటి అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలను, ఆత్మరక్షణ కోసం సాయుధ పోరాటం చేసే స్వాతంత్ర్య సమరయోధులతో పోల్చాడు. చెన్నైలో జరిగిన ఒక ఆందోళనలో పాల్గొన్న తిరుమావళన్, భారత్ తన ఇజ్రాయెల్ అనుకూల విధానాలను మార్చుకోవాలని కోరారు. ఆ సందర్భంలోనే మాట్లాడుతూ ‘‘ఉత్తర భారతీయులు ఇజ్రాయెలీలు, తమిళులు పాలస్తీనియన్లు’’ అని వ్యాఖ్యానించారు.
తిరుమావళవన్ తన ప్రసంగంలో పాలస్తీనియన్లు మొదట్లో యూదులను ఆదరించి, వారికి తలదాచుకోడానికి చోటు చూపించారని చెప్పుకొచ్చారు. ‘‘బ్రిటన్, అమెరికా మద్దతుతో ఇజ్రాయెల్ ప్రత్యేక దేశంగా ఏర్పడ్డాక, ప్రపంచమంతా చెల్లాచెదురై నిరాశ్రయులైన యూదులు ఒక్కొక్క చోట చేరి తమ జనాభాను క్రమంగా పెంచుతూనే ఉన్నారు. యూదుల జనాభా పెరుగుతూ రావడంతో పాలస్తీనియన్లకు తమ భూమిని వదిలిపెట్టేయవలసి వచ్చింది, అదే ఎన్నో ఘర్షణలకు కారణమైంది’’ అన్నారు.
పాలస్తీనాకు మద్దతుగా జరిగిన ఒక ప్రదర్శనలో తిరుమావళవన్ మాట్లాడుతూ, పాలస్తీనియన్లు తమ స్వదేశాన్ని మళ్ళీ స్వాధీనం చేసుకునే ప్రయత్నంలో ఎన్నో గ్రూపులు ఏర్పాటు చేసారని చెప్పారు. యాసర్ అరాఫత్ స్థాపించిన పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్‌తో పాటు హమాస్, హెజ్బొల్లా, హుతీ వంటి మిలిటెంటు సంస్థలు వాటిలో భాగమేనన్నారు. ‘‘సాధారణంగా వాటిని ఉగ్రవాద సంస్థలు అంటారు. కానీ, ఎల్‌టిటిఇ ఎందుకు ఏర్పడింది? సెల్వ పాతికేళ్ళ పాటు ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటం చేసాక కూడా సింహళీయులు తమిళుల డిమాండ్లను ఆమోదించలేదు. వాళ్ళ సొంతభాషలో మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు సాయుధ గ్రూపులు ఉనికిలోకి వచ్చాయి’’ అంటూ తిరుమావళవన్ చెప్పుకొచ్చారు.
మావళవన్ వ్యాఖ్యలు కొత్త వివాదానికి, కొత్త చర్చకూ దారి తీసాయి. ఉగ్రవాద సంస్థల వర్గీకరణ, సాయుధ పోరాటాల చారిత్రక నేపథ్యాల గురించి చర్చించాల్సిన ఆవశ్యకతను వెల్లడించాయి.
పాలస్తీనాకు మద్దతు పలికే క్రమంలో తొళ్ తిరుమావళవన్ ఇజ్రాయెల్ విధానాలను విస్తరణవాదం అంటూ విమర్శించాడు. పాలస్తీనియన్లు మొదట్లో తమ భూమిలో 40-45శాతానికే పరిమితమై ఉండేవారని, తర్వాత ఇజ్రాయెల్ 90శాతానికి పైగా ఆక్రమించుకుందనీ దాంతో పాలస్తీనాకు వెస్ట్‌బ్యాంక్, గాజా ప్రాంతం తప్ప ఇంకేమీ మిగల్లేదనీ వాపోయాడు. ‘‘ఇంతకీ మనం ఎవరివైపు నిలబడాలి? పాలస్తీనియన్లను తమ భూమి నుంచి తరిమివేసి వారి భూమిని ఆక్రమించేసిన ఇజ్రాయెల్ లేదా యూదు వర్గానికి మద్దతిస్తారా?’’ అని ప్రశ్నించారు. ఈ పరిస్థితిలో బాధితుల వైపే నిలబడాలంటూ ప్రకటించారు.
తిరుమావళవన్ తన ప్రసంగంలో భారతదేశంలోని జాతుల ప్రస్తావన కూడా తీసుకొచ్చారు. చెన్నై షావుకారుపేటలో నివసించే ఉత్తర భారతీయులను ఇజ్రాయెలీలతోను, ఉత్తర చెన్నైలోని తమిళ దళితులను పాలస్తీనియన్లతోనూ పోల్చారు. ‘‘యూదులు ఏం చేసారు? పాలస్తీనియన్లు వారికి కొంత భూమినిచ్చి, అందులో ఉండమన్నారు. మనం మార్వాడీలను షావుకారుపేటలో ఉండమంటే వారు అక్కడే ఉండాలి. అలా కాకుండా వాళ్ళు మెల్లగా అన్నానగర్ లాంటి ప్రాంతాల్లోకి విస్తరిస్తూ క్రమంగా చెన్నై అంతటినీ ఆక్రమించేస్తే ఏమవుతుంది?’’ అంటూ పోల్చారు.