గత ఏడాది వెలుగులోకి వచ్చిన మహాదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో కీలక నిందితుడిని దుబాయ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన చంద్రకర్‌ను యూఏఈ పోలీసులు ఇటీవల అరెస్ట్ చేశారు. చంద్రకర్‌పై ఇంటల్‌పోల్ లుక్‌అవుట్ నోటీసులు జారీ చేయడంతో అతన్ని యూఏఈ పోలీసులు అరెస్ట్ చేశారు. త్వరలో భారత్‌కు అప్పగించే అవకాశముంది. ఈ కేసులో మరో కీలక నిందితుడు రవి ఉప్పల్‌ను
యూఏఈ పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు.
ఛత్తీస్‌గఢ్ కేంద్రంగా కొనసాగిన మహాదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో అక్కడి సీనియర్ అధికారుల హస్తం కూడా ఉందని ఈడీ అనుమానిస్తోంది. దాదాపు 60 రకాల గేమింగ్ బెట్టింగ్ యాప్‌లు తయారు చేసి సెలబ్రిటీల ద్వారా ప్రకటనలు గుప్పించి, ప్రజల నుంచి దాదాపు రూ.15 వేల కోట్లు కొల్లగొట్టినట్లు ఈడీ గుర్తించింది. నిర్వాహకులు ఈ డబ్బును హవాలా మార్గంలో దుబాయ్ తరలించినట్లు కేంద్ర నిఘా సంస్థలు స్పష్టం చేశాయి.
బెట్టింగ్ యాప్ నిర్వాహకుడు చంద్రకర్ ఇటీవల యూఏఈలో రూ.200 కోట్లు ఖర్చు చేసి వివాహం చేసుకున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు ప్రచురించింది. ఇందుకు ప్రైవేటు జెట్‌లు కూడా బుక్ చేశారు. ఫైవ్ స్టార్ హోటళ్లో రూములకే రూ.42 కోట్లు ఖర్చు చేసినట్లు మీడియా కథనాల ద్వారా తెలుస్తోంది. సెలబ్రిటీలకు, ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థకు రూ.112 కోట్లు చెల్లించారు. ఇలా ప్రజల నుంచి దోచుకున్న డబ్బుతో జల్సాలు చేస్తున్నట్లు ఈడీ గుర్తించింది. త్వరలో నిందితులను భారత్ తీసుకురానున్నారు.