భారతదేశానికి గర్వకారణమైన పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా కన్నుమూసారు. భారతదేశపు అతిపెద్ద వ్యాపార సంస్థల్లో ఒకటైన టాటా సన్స్ గౌరవ ఛైర్మన్ రతన్ టాటా 86ఏళ్ళ వయసులో తుదిశ్వాస విడిచారు. ముంబైలోని బ్రీచ్‌క్యాండీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూన్న ఆయన బుధవారం దాదాపు అర్ధరాత్రి సమయంలో మరణించారు.
మూడు రోజుల క్రితం సోమవారం నాడే రతన్ టాటా తన ఆరోగ్యంపై వస్తున్న పుకార్లను కొట్టిపడేస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసారు. తన ఆరోగ్యం బాగానే ఉందని, వయసు రీత్యా క్రమం తప్పకుండా చేయించుకునే వైద్య పరీక్షలు చేయించుకుంటున్నాననీ అందులో వివరించారు.
స్టీల్ నుంచి సాఫ్ట్వేర్ వరకూ అన్నిరకాల వ్యాపారాల్లోనూ విస్తరించిఉన్న మహావాణిజ్య సంస్థ, వంద బిలియన్ డాలర్ల విలువైన ‘టాటా సన్స్’కు రతన్ టాటా 1991లో ఛైర్మన్ అయ్యారు. తన ముత్తాత వందేళ్ళ క్రితం స్థాపించిన సంస్థకు 2012 వరకూ చైర్మన్‌గా వ్యవహరించారు.
ఆయన 1996లో టెలికామ్ కంపెనీ ‘టాటా టెలిసర్వీసెస్’ను స్థాపించారు. ఐటీ కంపెనీ ‘టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్’ను 2004లో పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా చేసారు.
భారతదేశంలో అతితక్కువ కంపెనీలకు మాత్రమే సాధ్యమైన అత్యంత అరుదైన ఘనతను రతన్ టాటా సాధించారు. అత్యంత ప్రజాదరణ కలిగిన బ్రిటిష్ కార్ బ్రాండ్లు జాగ్వార్, లాండ్రోవర్లను రతన్ టాటా నేతృత్వంలోని టాటా గ్రూప్ అనే భారతీయ కంపెనీ 2004లో అక్వైర్ చేసింది.
మధ్యతరగతికి అందుబాటులో ప్రపంచంలోనే చౌకయిన కారును తీసుకొస్తానని వాగ్దానం చేసిన రతన్ టాటా, ఆ మాటను 2009లో నెరవేర్చుకున్నారు. లక్ష రూపాయల నామమాత్రపు ఖరీదుకే టాటా నానో కారును మార్కెట్లోకి తీసుకొచ్చారు.
టాటా గ్రూప్ కంగ్లోమెరేట్కు రతన్ టాటా రెండుసార్లు చైర్మన్ అయారు. 1991 నుంచి 2012 వరకూ ఆ తర్వాత 2016 నుంచి 2017 వరకూ ఆయన చైర్మన్ బాధ్యతలు నిర్వహించారు. తర్వాత ఆయన కంపెనీ దైనందిన వ్యవహారాల నుంచి తప్పుకున్నప్పటికీ, కంపెనీకి చెందిన ధార్మిక సంస్థల అధినేతగా కొనసాగారు.
టాటా గ్రూప్ చైర్మన్ బాధ్యతల నుంచి తప్పుకున్నాక ఆయన టాటా సన్స్, టాటా ఇండస్ట్రీస్, టాటా మోటార్స్, టాటా స్టీల్, టాటా కెమికల్స్ సంస్థలకు గౌరవ ఛైర్మన్‌గా వ్యవహరించారు.
పదవీ విరమణ తర్వాత రతన్ టాటా సామాజిక మాధ్యమాల్లో ప్రముఖవ్యక్తిగా నిలిచారు. జంతువుల హక్కుల కోసం, ప్రత్యేకించి శునకాల హక్కుల కోసం ఆయన పోరాడేవారు. జంషెడ్జీ టాటా సమయం నుంచి వస్తున్న పద్ధతిని పాటిస్తూ, టాటా గ్రూప్ ప్రధాన కార్యాలయం బోంబేహౌస్ను వీధికుక్కలకు ఆవాసకేంద్రంగా కొనసాగించారు.
సామాజిక మాధ్యమాల్లో అమితమైన ఫాలోయింగ్ ఉన్న పారిశ్రామికవేత్త రతన్ టాటాయే. ‘ఎక్స్’లో ఆయనకు కోటీ 30లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో సుమారు కోటిమంది ఫాలోవర్స్ ఉన్నారు.
రతన్ టాటా 1937లో జన్మించారు. 1948లో తల్లిదండ్రులు విడిపోయాక ఆయన తన నానమ్మ నవాజ్‌బాయి టాటా దగ్గర పెరిగారు.
రతన్ టాటా కార్నెల్ విశ్వవిద్యాలయంలో ఆర్కిటెక్చర్ చదువుకున్నారు. దాని తర్వాత హార్వర్డ్‌లో మేనేజ్మెంట్ కోర్స్ పూర్తిచేసారు.
భారత ప్రభుత్వం రతన్‌టాటాను 2000 సంవత్సరంలో పద్మభూషణ్ పురస్కారంతోనూ, 2008లో పద్మవిభూషణ్ పురస్కారంతోనూ సత్కరించింది.
జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు