సప్తగిరులపై తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా సాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారు బుధవారం ఉదయం శ్రీరాముని అవతారంలో హనుమంత వాహనంపై మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు. గురుశిష్యులైన శ్రీరామ హనుమంతులు తత్త్వవివేచన తెలిసిన మహనీయులుగా పురాణాలు చెబుతున్నాయి. కనుక ఈ ఇరువురిని ఏకకాలంలో దర్శించిన వారికి వేదాలతత్త్వం ఒనగూరుతుందని విశ్వాసం. స్వామివారికి సాయంత్రం స్వర్థ రథోత్సవం నిర్వహించనున్నారు. రాత్రికి గజ వాహన సేవ జరపనున్నారు.
ఐదో రోజైన అనగా మంగళవారం రాత్రి శ్రీ మలయప్పస్వామివారికి గరుడ వాహనసేవ నిర్వహించారు. స్వామివారు లక్ష్మీకాసుల మాల ధరించి భక్తులకు దర్శనమిచ్చారు. గజరాజులు నడుస్తుండగా, భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల ఘోష్టి మధ్య వైభవంగా గరుడవాహన సేవ జరిగింది.
పౌరాణిక నేపథ్యం ప్రకారం 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవకు చాలా ప్రాముఖ్యం ఉంది. గరుడవాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని వివరిస్తారు. గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తులు నమ్ముతారు.