తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. గోవిందనామ స్మరణతో సప్తగిరులు పులకించిపోతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రోజుకో అవతారంలో దర్శనమిస్తున్న మలయప్ప స్వామివారు భక్తులను కటాక్షిస్తున్నారు.
ఉత్సవాల్లో భాగంగా ఐదో రోజైన మంగళవారం ఉదయం మోహినీ అవతారంలో శ్రీనివాసుడు భక్తులను కటాక్షించారు. శృంగార రసాధి దేవతగా సర్వాలంకార భూషితుడై భక్తులకు దర్శనమిచ్చారు. ఆ పక్కనే దంతపు వాహనంపై వెన్నముద్ద చేతపట్టిన కృష్ణుడిగా కూడా స్వామి భక్తులను అనుగ్రహించారు. ముగ్ధమనోహర మోహిని, ఆ్ష వెన్నంటే వెన్నదొంగ కృష్ణుడు తిరుమాడ వీధుల్లో విహరించారు. మాయా జగత్తు నుంచి భక్తులను బయటపడేయటమే మోహినీ అవతారం యొక్క పరమార్థం.
బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమల మాడ వీధుల్లో భక్తజన బృందాలు చెక్కభజనలు, మంగళ వాయిద్యాల నడుమ, కోలాటాలతో స్వామివారిని ఆరాధించారు. నేటి సాయంత్రం స్వామివారికి గరుడ వాహన సేవ జరుగనుంది. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని అంచనా వేసిన టీటీడీ, అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేసింది.