ఏపీకి కేంద్రం శుభవార్త అందించిందని సీఎం చంద్రబాబునాయుడు వెల్లడించారు. డిసెంబరులో ప్రధాని మోదీ విశాఖ రైల్వే జోన్‌కు శంకుస్థాపన చేయనున్నారని ఆయన తెలిపారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీని కలసిన అనంతరం చంద్రబాబు ఎంపీలకు ఈ విషయం చెప్పారు.అమరావతి రాజధానికి ప్రపంచ బ్యాంకు రుణం, పోలవరం నిర్మాణానికి నిధుల మంజూరు, ఇటీవల వచ్చిన వరదలకు నష్ట పరిహారంపై చంద్రబాబు ప్రధాని మోదీతో గంటకుపైగా చర్చలు జరిపారు. ప్రధాని సానుకూలంగా స్పందించినట్లు చంద్రబాబు చెప్పారు.
పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం రూ.2800 విడుదల చేసింది. అమరావతి రాజధాని అవుటర్ రింగు రోడ్డు ప్రాజెక్టు మొత్తం వ్యయం కేంద్రం భరించేందుకు సంసిద్దత వ్యక్తం చేసిందని తెలుస్తోంది. ఏపీలో ఐటీ, సెమీకండక్టర్ పరిశ్రమల ఏర్పాటుపై కేంద్ర రైల్వే, ఐటీ, ఎలక్ట్రానిక్స్ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. పలు పరిశ్రమల ఏర్పాటుపై చర్చించినట్లు సీఎంఓ తెలిపింది.
అమరావతి రాజధానిలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి వెంటనే నిధులు విడుదల చేయాలని సీఎం చంద్రబాబునాయుడు, ప్రధాని మోదీని కోరినట్లు సీఎంఓ ఓ ప్రకటనలో తెలిపింది. విభజన హామీలతో పాటు పలు కీలక ప్రాజెక్టుల అమలు, 2047నాటికి వికసిత్ భారత్ సాకారం అయ్యేందుకు ఏపీకి ఆర్థిక సాయం చేయాలని ప్రధానిని కోరినట్లు సీఎంఓ వెల్లడించింది.