పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతాలోని ఆర్‌జి కర్ వైద్య కళాశాల ఆస్పత్రిలో వైద్యురాలి అత్యాచారం, హత్య కేసులో నిందితుడు కోల్‌కతా పోలీస్ విభాగంలో కాంట్రాక్టు స్టాఫ్‌గా పనిచేస్తున్న సంజయ్ రాయ్ అని సిబిఐ ఆరోపించింది. ఆ మేరకు చార్జిషీట్‌ను సియాల్డాలోని ప్రత్యేక న్యాయస్థానానికి ఈ మధ్యాహ్నం సమర్పించింది.
సిబిఐ ఛార్జిషీట్ ప్రకారం కోల్‌కతా పోలీస్ విభాగంలో పౌర వాలంటీరుగా సేవలందిస్తున్న నిందితుడు సంజయ్ రాయ్ అనే వ్యక్తే అని ఆరోపించింది. బాధితురాలు ఆస్పత్రిలోని సెమినార్ రూమ్‌లో విశ్రాంతి తీసుకోడానికి వెళ్ళినప్పుడే ఈ ఘాతుకానికి నిందితుడు పాల్పడ్డాడని సిబిఐ తన ఛార్జిషీట్‌లో వెల్లడించింది.
ఈ కేసుకు సంబంధించి సిబిఐ వర్గాలు సుమారు 200 మంది వ్యక్తుల వాంగ్మూలాలను నమోదు చేసాయి. ఈ కేసులో మరింతమంది నిందితులు ఉన్నారా, జరిగిన దుర్మార్గం సామూహిక అత్యాచారమా అనే కోణంలో దర్యాప్తు జరుగుతోందని సిబిఐ వర్గాల సమాచారం. మొత్తం మీద ఆ దుర్మార్గంలో సంజయ్ రాయ్ ప్రధాన నిందితుడని తెలుస్తోంది.
బాధిత వైద్యురాలు ఆగస్టు 9న ఆర్‌జి కర్ ఆస్పత్రిలో విధుల్లో ఉండగానే ప్రాణాలు కోల్పోయింది. అనంతర పరిణామాలు, దేశవ్యాప్త నిరసనల నేపథ్యంలో కోర్టు ఈ కేసు విచారణను సిబిఐకి అప్పగించింది.
ఆ కేసులో నిందితుడైన సంజయ్ రాయ్‌ని సంఘటన జరిగిన మర్నాడు కోల్‌కతా పోలీసులు అరెస్ట్ చేసారు. ఆ సమయంలో కళాశాల ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌ను ఈడీ, సీబీఐ రెండు వేర్వేరు కేసుల్లో అరెస్ట్ చేసారు.
మృతురాలి సహాధ్యాయులు గత రెండు నెలలుగా ఆందోళన చేస్తూనే ఉన్నారు. తాజాగా కొన్ని రోజుల క్రితం వారు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు.