తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో జంతువుల కొవ్వు కలిపారంటూ చెలరేగిన వివాదంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఐదుగురు స్వతంత్ర సభ్యులతో సెట్ ఏర్పాటు చేసింది. ఇందులో సీబీఐ నుంచి ఇద్దరు, ఏపీ ప్రభుత్వం నుంచి ఇద్దరు, ఎఫ్‌ఎస్ఎస్‌ఏఐ నుంచి ఒకరు ఈ బృందంలో పనిచేయనున్నారు. తిరుమల లడ్డూలో పందికొవ్వు కలిపారంటూ ఏపీ ప్రభుత్వం సిట్ విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రముఖ న్యాయవాది, ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి, వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.దీనిపై విచారించిన జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ విశ్వనాథన్ ధర్మాసనం సిట్ ఏర్పాటు చేయాలని ఆదేశించింది.
గత సోమవారం తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. దీనిపై కేంద్ర ప్రభుత్వ నిర్ణయం కూడా తీసుకోవాలంటూ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ఆదేశించింది. తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ వ్యవహారం చాలా దారుణమని, అలా జరిగి ఉంటే కోట్లాది మంది భక్తుల విశ్వాసం దెబ్బతింటుందని ఆయన అభిప్రాయపడ్డారు. దర్యాప్తు బృందంలో కేంద్ర నుంచి కూడా అధికారులు ఉంటే విశ్వాసం పెరుగుతుందన్నారు. గురువారం సాయంత్రం ఈ కేసు విచారించాల్సి ఉండగా, జస్టిస్ గవాయ్ వేరే బెంచిలో ఉండటంతో ఇవాళ ఉదయం కోర్టు ప్రారంభం కాగానే మొదటి కేసుగా విచారించారు. ఐదుగురు సభ్యులతో సెట్ ఏర్పాటు చేయాలని ధర్మాసనం ఆదేశించింది.