ఏపీలో కూటమి ప్రభుత్వం మరో కీలక హామీని అమలు చేసింది. ఆదరణ పెద్దగా లేని ఆలయాల్లో దూప,దీప, నైవేద్యాలు సమర్పించే పూజారులకు ఇప్పటి వరకు అందిస్తోన్న రూ.5 వేల సాయాన్ని, ఇక నుంచి రూ.10 వేలకు పెంచుతూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. దేవాలయాల్లో నిత్యం దీపం వెలిగించడం, నైవేద్యం పెట్టేందుకు ఈ సాయం అందించనున్నారు. గతంలో ఈ మొత్తం రూ.2500గా ఉంది. 2015లో అప్పటి ప్రభుత్వం రూ.5 వేలకు పెంచింది. తాజాగా రూ.10 వేలకు పెంచారు.
ప్రభుత్వ నిర్ణయంతో 7 వేల మంది అర్చకులకు మేలు జరగనుంది. ప్రతి నెలా పూజారుల ఖాతాలో ఈ సొమ్ము జమచేయనున్నారు. దీని వల్ల ప్రభుత్వంపై ఏటా రూ.32.40 కోట్ల భారం పడుతుందని దేవాదాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.సత్యనారాయణ తెలిపారు.