అంతర్జాతీయ రోదసీ కేంద్రం – ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఐఎస్ఎస్‌లో చిక్కుకుపోయిన ఇద్దరు వ్యోమగాములను తీసుకొచ్చేందుకు భూమినుంచి బయల్దేరిన స్పేస్-ఎక్స్ క్యాప్సూల్, గమ్యానికి చేరుకుంది.
అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం కేప్ కనవెరాల్ నుంచి స్థానిక కాలమానం ప్రకారం శనివారం మధ్యాహ్నం 1.17కు ఫాల్కన్ 9 రాకెట్‌ను ప్రయోగించారు. అందులోని డ్రాగన్ స్పేస్‌క్రాఫ్ట్‌లో ఉన్న క్రూ-9 మిషన్ సభ్యులు, ఆదివారం సాయంత్రం 5.30కు ఐఎస్ఎస్‌కు చేరుకున్నారు. స్పేస్ ఎక్స్ క్యాప్సూల్, రోదసీ కేంద్రంతో అనుసంధానమయ్యాక అమెరికన్ వ్యోమగామి నిక్ హేగ్, రష్యన్ వ్యోమగామి అలెగ్జాండర్ గొర్బునోవ్ ఆదివారం రాత్రి 7గంటలకు ఐఎస్ఎస్‌లోకి చేరుకున్నారు.
ఆ విషయాన్ని నాసా అధికారికంగా ప్రకటించింది. నాసా డిప్యూటీ అడ్మినిస్ట్రేటర్ పామ్ మెల్రాయ్ ‘‘ఇదొక గొప్ప రోజు’’ అని వ్యాఖ్యానించారు.
నిక్ హేగ్, అలెగ్జాండర్ గొర్బునోవ్ రోదసిలో ఐదు నెలల పాటు ఉంటారు. వారు వెనక్కు తిరిగి వచ్చేటప్పుడు వారితో పాటు బచ్ విల్మోర్, సునీతా విలియమ్స్ కూడా భూమ్మీదకు వస్తారు. వారు ఇప్పటికే కొన్ని నెలలుగా రోదసిలో చిక్కుకుపోయారు.
బోయింగ్ సంస్థ తయారుచేసిన స్టార్‌లైనర్ స్పేస్‌క్రాఫ్ట్‌లో విల్మోర్-సునీత ద్వయం మొన్న జూన్‌లో, అంటే సుమారు నాలుగు నెలల క్రితం రోదసిలోకి వెళ్ళారు. అక్కడ వారు 8 రోజులు ఉండి, వెనక్కు రావలసి ఉంది. అయితే స్టార్‌లైనర్ స్పేస్‌క్రాఫ్ట్ ప్రొపల్షన్ సిస్టమ్‌లో సమస్యలు తలెత్తాయి. దాంతో వారి ప్రయాణం వాయిదా పడింది. స్టార్‌లైనర్ స్థితిగతులను కొంతకాలం పరీక్షించిన నాసా, అందులో విల్మోర్, సునీతలను వెనక్కు తీసుకురావడం సురక్షితం కాదని భావించింది. వారిని స్పేస్ ఎక్స్ క్రూ-9 మిషన్‌తో పాటు వెనక్కు భూమిమీదకు తీసుకురావాలని నిర్ణయించింది.
స్పేస్ ఎక్స్ అనేది ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్, అంతరిక్ష ప్రయోగాల కోసం స్థాపించిన ప్రైవేటు సంస్థ. అది ప్రతీ ఆరు నెలలకోసారి ఐఎస్ఎస్‌కు పరిశోధకులను తీసుకువెడుతూ ఉంటుంది. ఆ సంస్థ, క్రూ-9ను ఆగస్టులో ప్రయోగించాలి. అయితే స్టార్‌లైనర్ స్థితిగతులను నాసా పరీక్షించి ఏం చేయాలో తేల్చేవరకూ క్రూ-9 ప్రయోగాన్ని నిలిపివేసారు. ఆ తర్వాత హెలెనే హరికేన్ ప్రభావంతో క్రూ-9 ప్రయోగం మరికొన్ని రోజులు వాయిదా పడింది. ఎట్టకేలకు శనివారం బయల్దేరింది.
నిక్ హేగ్, అలెగ్జాండర్ గొర్బునోవ్ జంట ఐఎస్ఎస్‌లో ఐదు నెలల పాటు ఉంటారు. విల్మోర్, సునీతా విలియమ్స్ ఇప్పటికే మూడు నెలలుగా అక్కడే ఉన్నారు. 2025 ఫిబ్రవరిలో వారు నలుగురూ కలిసి భూమ్మీదకు తిరిగి వస్తారు.