అమెరికా, ఫ్రాన్స్, ఇప్పుడు ఇంగ్లండ్… ఇలా, ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారత్ ప్రయత్నాలకు మద్దతిస్తున్న దేశాల సంఖ్య పెరుగుతోంది. జో బైడెన్, ఇమాన్యుయెల్ మాక్రాన్ తర్వాత ఇంగ్లండ్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ భారత్‌కు మద్దతు ప్రకటించారు.
గురువారం ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ 79వ సమావేశం న్యూయార్క్‌లో జరిగింది. ఆ సమావేశంలో పాల్గొన్న కీర్ స్టార్మర్, భద్రతామండలిలో మార్పు రావాలనీ, మరిన్ని దేశాలకు ప్రాతినిధ్యం ఉండాలనీ చెప్పారు.
ప్రస్తుతం భద్రతామండలిలో ఐదు శాశ్వత సభ్యదేశాలతో పాటు పది తాత్కాలిక సభ్యదేశాలు ఉన్నాయి. రష్యా, ఇంగ్లండ్, చైనా, ఫ్రాన్స్, అమెరికాలు శాశ్వత సభ్యదేశాలు. వాటికి వీటో అధికారం ఉంటుంది. అంటే ఐరాస ముందుకు వచ్చిన ఏ తీర్మానాన్ని అయినా ఆ శాశ్వత సభ్యదేశాల్లో ఏ ఒక్కటి తిరస్కరించినా ఆ తీర్మానం వీగిపోయినట్లే. ఇంక, తాత్కాలిక సభ్యదేశాలను ప్రతీ రెండేళ్ళకోసారి సర్వప్రతినిధి సభ ఎన్నుకుంటుంది.
‘‘భద్రతా మండలిలో ఆఫ్రికాకు శాశ్వత ప్రాతినిథ్యం కావాలి. బ్రెజిల్, భారత్, జపాన్, జర్మనీలను శాశ్వత సభ్యదేశాలుగా చేయాలి. ఎన్నికయ్యే తాత్కాలిక సభ్య దేశాల సంఖ్యను కూడా పెంచాలి’’ అని స్టార్మర్ గురువారం నాటి సర్వప్రతినిధి సభ సమావేశంలో తన ప్రసంగంలో కోరారు.
అంతకుముందు బుధవారం ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయెల్ మాక్రాన్ కూడా భారత్‌ను భద్రతామండలిలో శాశ్వత సభ్యదేశంగా చేర్చాలంటూ మన దేశానికి బలమైన మద్దతు పలికారు. ‘‘జర్మనీ, జపాన్, భారత్, బ్రెజిల్ దేశాలకు శాశ్వత సభ్యత్వం ఇవ్వాలి. అలాగే ఆఫ్రికా నుంచి ఆ ఖండం నిర్ణయం ప్రకారం రెండు దేశాలకు అవకాశం ఇవ్వాలి’’ అని మాక్రాన్ చెప్పుకొచ్చారు.
గత శనివారం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా అదే అభిప్రాయం వెలిబుచ్చారు. డెలావర్‌లోని తన నివాసంలో ప్రధాని మోదీతో భేటీ సందర్భంగా బైడెన్ మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయిలో భారత్ గళానికి ప్రాధాన్యం దక్కేలా ప్రపంచస్థాయి సంస్థల్లో సంస్కరణల కోసం చేసే ప్రయత్నాలకు అమెరికా మద్దతిస్తుందన్నారు. అందులో భాగంగా ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం ఇవ్వడానికి అమెరికా మద్దతిస్తుందని ప్రకటించారు.
భారత్‌కు భద్రతామండలిలో చివరిసారి 2021-22లో తాత్కాలిక సభ్యదేశంగా అవకాశం దక్కింది.