‘హిజ్బ్-ఉత్-తహ్రీర్’ అతివాద ఇస్లామిక్ సంస్థ కార్యకలాపాలపై దర్యాప్తు చేస్తున్న జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఎ మంగళవారం నాడు తమిళనాడులోని 11 ప్రదేశాల్లో సోదాలు నిర్వహించింది. భారత్‌ను ముస్లిందేశంగా మార్చాలన్న మహాకుట్రలో భాగంగా హిజ్బుత్ తహ్రీర్ పలు కార్యక్రమాలు నిర్వహిస్తోంది. మధ్యప్రాచ్యంలోని ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ ఐసిస్ కోసం యువత రిక్రూట్‌మెంట్, ఎన్నికల వ్యతిరేక ప్రచారం వంటి పనుల్లో ఆ సంస్థ పాల్గొన్నట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటోంది.
చెన్నయ్, తాంబరం, కన్యాకుమారి సహా తమిళనాడులోని పలు జిల్లాల్లో ఈ సోదాలు నిర్వహించారు. అందులో భాగంగా పలు డిజిటల్ పరికరాలు, లెక్కల్లో లేని ధనం, అతివాద సాహిత్యం లభ్యమయ్యాయి. ఈ కేసును మొదట చెన్నయ్ సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు విచారించడం మొదలుపెట్టారు. కొన్నాళ్ళ క్రితం ఆరుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసారు. ఆ నిందితులు ‘హిజ్బ్-ఉత్-తహ్రీర్’ సంస్థ ప్రభావంతో అతివాదులుగా మారారని తెలిసింది.
హిజ్బుత్ సంస్థను తకీ-అల్-దిన్-అల్-నభానీ అనే వ్యక్తి ప్రారంభించాడు. ఆ సంస్థకు ప్రజాస్వామ్యం, ఎన్నికలు వంటి అంశాలు సరిపడవు. ప్రపంచం అంతటినీ ఇస్లామిక్ రాజ్యం చేయాలని, ఇస్లామిక్ చట్టాన్ని అమలు చేయాలనీ, ఎన్నికలు-ప్రజాస్వామ్యం వంటి విషయాలు ‘హరామ్’ అనీ ఆ సంస్థ చెబుతుంది.
తర్వాత కేసును ఎన్ఐఎకి అప్పగించారు. ఆ సంస్థ 2024 జులై 24న ఎఫఐఆర్ నమోదు చేసింది. ఆగస్టు 5న చెన్నై పోలీసులు ఈ కేసుకు సంబంధించిన కీలక పత్రాలు ఎన్ఐఎకు అందజేసారు. ఆగస్టు 30న ప్రధాన నిందితుడు జలీల్ అజీజ్ అహ్మద్ విదేశాలకు పారిపోయే ప్రయత్నంలో ఉండగా ఎన్ఐఎ అధికారులు బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో అరెస్ట్ చేసారు.
ఆ నేపథ్యంలో ఎన్ఐఎ తాజా సోదాలు చేపట్టింది. రాయపేటలోని సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మహమ్మద్ రియాజ్ నివాసాన్ని, కన్యాకుమారిలో నివసించే మతగురువు మహమ్మద్ అలీ ఇంటిని, మిగతా నిందితుల నివాస ప్రాంతాలనూ సోదా చేసారు.
ఈ కేసులో భాగంగా పలువురిని ఇప్పటికే అరెస్ట్ చేసారు. తంజావూరులో అబ్దుల్ రెహమాన్‌ను (26) అరెస్ట్ చేసారు. ముజిబీర్ రెహమాన్ (46) చెన్నైలోని తిరువాన్మియూర్‌లో దొరికాడు. అజీజ్ అహ్మద్ (36) అనే మరో నిందితుణ్ణి సైతం బంధించారు. తర్వాత ఈ కేసులో ప్రముఖ వ్యక్తులు డాక్టర్ హమీద్ హుసేన్, అహ్మద్ మన్సూర్, అబ్దుల్ రెహమాన్, మొహమ్మద్ మారిస్, కదర్ నవాజ్ షరీఫ్, అహ్మద్ అలీ ఉమరీ అనే వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.