లెబనాన్ రాజధాని బీరూట్ మీద మంగళవారం ఇజ్రాయెల్ వైమానిక దాడి చేసింది. ఆ దాడిలో లెబనాన్ పారామిలటరీ విభాగం, షియా ముస్లిముల రాజకీయ పార్టీ, ఇరాన్ మద్దతున్న మిలిటెంట్ సంస్థ అయిన హెజ్బొల్లా క్షిపణి విభాగం అధిపతి ఇబ్రహీం కుబైసీ హతమయ్యాడు. ఇరుదేశాల సరిహద్దుల వెంబడి, ఇజ్రాయెల్ హెజ్బొల్లా దళాల మధ్య కాల్పులు మంగళవారం రోజంతా కొనసాగుతూనే ఉన్నాయి. హెజ్బొల్లా దళాలు ఇజ్రాయెల్ మీదకు 300 పైగా రాకెట్లు ప్రయోగించారు.
ఇబ్రహీం కుబైసీ హెజ్బొల్లా సంస్థకు రాకెట్లు, క్షిపణుల విభాగం కమాండర్ ఇన్‌ఛార్జ్. బీరూట్ శివార్లలోని దాహియే ప్రాంతంలో ఇజ్రాయెల్ చేసిన గగనతల దాడిలో హతమయ్యాడు. కుబైసీ మరణించినట్లు ఇజ్రాయెలీ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడిఎఫ్) నిర్ధారించింది.
మంగళవారం రోజంతా హెజ్బొల్లా మిలిటెంట్లు ఇజ్రాయెల్ ఉత్తరభాగంలోని హైఫా, సఫేద్, నజరేత్ వంటి నగరాలపై కాల్పులు జరుపుతూనే ఉన్నారు. 300కు పైగా రాకెట్లను ప్రయోగించారు. ఇజ్రాయెల్ లెబనాన్ సరిహద్దుల వెంబడి తీవ్రమైన ఘర్షణలు కొనసాగుతూనే ఉన్నాయి. వాటికి స్పందనగానా అన్నట్లు ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది.
ఇజ్రాయెల్ దాడుల్లో కుబైసీతో పాటు కనీసం మరో ఇద్దరు హెజ్బొల్లా ఉన్నతాధికారులు హతమయ్యారని ఐడిఎఫ్ వెల్లడించింది. వారు కూడా హెజ్బొల్లా క్షిపణి ప్రయోగాలకు బాధ్యులే. వారి చర్యల కారణంగా ఇజ్రాయెల్‌పై ముమ్మరంగా దాడులు జరుగుతున్నాయి.
కుబైసీ మరణించినట్లు హెజ్బొల్లా కూడా ధ్రువీకరించింది. ‘జెరూసలెం చేరుకునే దారిలో అమరుడైన వీరుడి’గా అతన్ని అభివర్ణించింది. కుబైసీ హెజ్బొల్లా సంస్థలో 1980లలో చేరాడు. ఎన్నోయేళ్ళపాటు హెజ్బొల్లా మిసైల్, రాకెట్ విభాగాలను నిర్వహించాడు. ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా హెజ్బొల్లా రూపొందించిన సైనిక ప్రణాళికలో కుబైసీ కీలక వ్యక్తి. హెజ్బొల్లాలో సైతం అతనికి పలువురు మిలటరీ అధికారుల మద్దతుంది.
2000 సంవత్సరంలో హెజ్బొల్లా మిలిటెంట్లు ముగ్గురు ఇజ్రాయెలీ సైనికులను చంపేసారు. వారి శవాలను 2004లో ఖైదీల పరస్పర అప్పగింత ఒప్పందం కింద వారిస్వదేశానికి చేర్చారు. ఆ దాడిలో తన ప్రమేయం ఉండడం ఉద్దేశపూర్వకమైనది అనే భావించవచ్చు.
దాహియే ప్రాంతంలో జరిగిన వైమానిక దాడిలో కనీసం 6గురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు, మరో 15మంది గాయపడ్డారు. లెబనాన్‌లో ఇటీవల వరుసగా ఇజ్రాయెల్ చేస్తున్న వైమానిక దాడుల్లో వందల మంది లెబనాన్ వాసులు ప్రాణాలు కోల్పోయారు.
ఇజ్రాయెల్ లెబనాన్ మధ్య ఘర్షణలు మధ్యప్రాచ్యంలో భారీ యుద్ధానికి దారితీస్తాయని ఆందోళన వ్యక్తమవుతోంది. యెమెన్, ఇరాక్ దేశాలు ఇరాన్‌కు అండగా నిలుస్తాయని అంచనా. కనురెప్పపాటులో లెబనాన్ ధ్వంసమైపోతుందని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గెటెరెస్ ఆందోళన వ్యక్తం చేసారు. ఇరుపక్షాలూ ఘర్షణలను నివారించాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అర్ధించారు.
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మాత్రం ఎంతమాత్రం తగ్గేదే లేదంటున్నారు. లెబనాన్‌లోని హెజ్బొల్లా మిలటరీ స్థావరాలు అన్నింటినీ ధ్వంసం చేసి తీరతామని ప్రకటించారు. క్షిపణులు దాచిపెట్టిన నివాసాలను సైతం వదిలే ప్రసక్తే లేదని నెతన్యాహు హెచ్చరించారు.