తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగం ఆరోపణలు సహా గత వైఎస్ఆర్‌సిపి హయాంలో తిరుమలలో అధికార దుర్వినియోగం, ఇతర అక్రమాలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం ‘సిట్’ ఏర్పాటుకు సిద్ధమవుతోంది. మరోవైపు నేతి సరఫరాలో సరైన ప్రమాణాలు పాటించలేదన్న ఆరోపణలపై ఎఆర్ డెయిరీ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు ఎఫ్ఎస్ఎస్ఎఐ నోటీసులు జారీ చేసింది.
రాష్ట్రప్రభుత్వం తిరుమల వ్యవహారాలపై ఏర్పాటు చేయనున్న సిట్‌కు అధిపతిగా గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠీని నియమించనుంది. ఆ దర్యాప్తు బృందంలో విశాఖపట్నం రేంజ్ డిఐజి గోపీనాథ్ జెట్టి, కడప ఎస్‌పి హర్షవర్ధన్ రాజు, మరికొందరు డిఎస్‌పిలు, సిఐలు, ఎస్‌ఐలు ఉంటారు.
తిరుమల లడ్డూల తయారీలో ఉపయోగించే నెయ్యి నాణ్యతను తనిఖీ చేసిన ఎన్‌డిడిబి తన నివేదికలో, ఆ నేతిలో చేపనూనె, పందికొవ్వు, ఆవుకొవ్వు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నివేదిక ఇచ్చింది. దాంతో ప్రపంచవ్యాప్తంగా హిందువుల్లో ఆవేదన, ఆందోళన, ఆగ్రహావేశాలు పెచ్చరిల్లాయి. ఆ నేపథ్యంలో ఆ వ్యవహారంపై దర్యాప్తు చేయించడానికి రాష్ట్రప్రభుత్వం సిద్ధమవుతోంది.
మరోవైపు, నాసిరకం నెయ్యిని సరఫరా చేసిన సంస్థకు ఎఫ్ఎస్ఎస్ఎఐ తాఖీదులు జారీచేసింది. ఆహార భద్రత, ప్రమాణాల నిబంధనలను ఉల్లంఘించినందుకు తమిళనాడుకు చెందిన ఎఆర్ డెయిరీ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ లైసెన్సును ఎందుకు సస్పెండ్ చేయకూడదని ప్రశ్నించింది.