తిరుమల లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు కలిపారనే ఆరోపణల వ్యవహారం హైకోర్టుకు చేరింది. వైసీపీ పాలనలో 2022లో నందిని డైరీ ఆవునెయ్యి సరఫరా కాంట్రాక్టు రద్దు చేసి, ఐదుగురికి ఇవ్వడం, వారు జంతువుల కొవ్వును కలపి సరఫరా చేశారని నివేదికలు రావడంతో దుమారం మొదలైంది. దీనిపై వెంటనే విచారణ జరిపి నిజనిర్ధారణ చేసేలా కమిటీని వేయాలని వైసీపీ తరపున పొన్నవోలు సుధాకర్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. చాలా అత్యవసరంగా ఈ కేసును విచారణకు తీసుకోవాలని న్యాయవాది హైకోర్టును కోరారు. బుధవారం విచారణ చేపడతామని కోర్టు వెల్లడించింది.
తిరుమల లడ్డూ తయారీలో ఉపయోగించే ఆవునెయ్యిలో జంతువుల కొవ్వు కలపారని గుజరాత్‌లోని నేషనల్ డైరీ డెవలప్మెంట్ సంస్థకు చెందిన ల్యాబులో జరిపిన పరీక్షల ద్వారా వెల్లడైంది. దీనిపై ఇప్పటికే తిరుమలలో విచారణ జరుగుతోంది. జంతువుల కొవ్వు సరఫరా చేసిన కాంట్రాక్టర్లను రద్దు చేశారు. తాజాగా కర్నాటకకు చెందిన నందిని మిల్క్ ఫెడరేషన్ కు ఆవు నెయ్యి సరఫరా బాధ్యతలు అప్పగించారు.