వరద వదంతులు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. బుడమేరుకు మరోసారి వరద పోటెత్తుతోందంటూ శనివారం వదంతులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో అజిత్‌సింగ్ నగర్, రాజరాజేశ్వరిపేట, నందమూరినగర్, తోటవారివీధి, హుడాకాలనీ, ప్రకాశ్‌నగర్ వాసులు హడలిపోయారు. అంబాపురం కాలనీలో వరద తగ్గకపోవడంతో అధికారులు వైఎస్‌ఆర్ రోడ్డుకు గండి కొట్టి నీటిని మళ్లించారు. ఆ నీరు హుడా కాలనీ వైపు చేరడంతో జనం హడలిపోయారు. వరద వస్తోందంటూ కొందరు ప్రచారం చేయడంతో కాలనీ ప్రజల్లో ఆందోళన మరింత పెరిగిపోయింది. ఈ విషయం తెలిసిన పోలీసులు, వదంతులు నమ్మవద్దంటూ నేరుగా కాలనీలకు వెళ్లి ప్రచారం నిర్వహించారు.
వదంతులు ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ మంత్రి నారాయణ అధికారులను ఆదేశించారు. ఇప్పటికీ ఆరు కాలనీల్లో నిలిచిపోయిన వరదను మళ్లించేందుకు ఇన్నర్‌రిండు రోడ్డు, నున్న రోడ్డుకు 50 చోట్ల గండ్లు కొట్టించామని గుర్తుచేశారు. మరలా వరద వస్తోందంటూ జరుగుతున్న ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదన్నారు.
సోషల్‌మీడియాలో తప్పుడు ప్రచారం చేసేవారిపై కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు. సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టిన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. వరద వదంతులు వైరల్ చేస్తే క్రిమినల్ కేసులు పెట్టాల్సి వస్తుందని పోలీసులు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.