భారతదేశం నుంచి పారిపోయి ప్రస్తుతం మలేషియాలో నివసిస్తున్న వివాదాస్పద మతగురువు జకీర్ నాయక్ వక్ఫ్ సవరణ బిల్లు 2024, ముసల్మాన్ వక్ఫ్ రద్దు బిల్లు 2024లను వ్యతిరేకించాలంటూ భారతీయ ముస్లిములకు పిలుపునిచ్చాడు. భారత ప్రభుత్వం ప్రతిపాదించిన సవరణలు ఇస్లామిక్ వ్యవస్థలు, వక్ఫ్ ఆస్తుల మీద ప్రతికూల ప్రభావం చూపుతాయని ఆరోపిస్తూ, ఆ బిల్లులను తిరస్కరించాలని ముస్లిములను కోరాడు.
వక్ఫ్ సవరణ బిల్లు వల్ల భవిష్యత్తులో ఇస్లాం మతానికి కష్టాలు దాపురిస్తాయంటూ ఆ బిల్లుకు వ్యతిరేకంగా సామూహిక ఆందోళనలు చేపట్టాలని జకీర్ నాయక్ పిలుపునిచ్చాడు. కనీసం 50లక్షల మంది ముస్లిములు ఆ బిల్లులను వ్యతిరేకించాలని కోరాడు. ఒకవేళ బిల్లులు పాసై చట్టరూపం దాలిస్తే భవిష్యత్ తరాలను అల్లా శిక్షిస్తాడని హెచ్చరించాడు. వక్ఫ్ ఆస్తుల మీద హక్కులు ముస్లిములకు మాత్రమే ఉన్నాయని, ముస్లిమేతరులను ఆ ఆస్తుల దగ్గరకు కనీసం రానీయనైనా రానీయకూడదని జకీర్ నాయక్ చెప్పుకొచ్చాడు. ప్రతిపాదిత చట్టం నుంచి వక్ఫ్ ఆస్తులను రక్షించలేకపోతే ముస్లిములు ఈ జన్మలోనే కాదు, వచ్చే జన్మలో కూడా వారే బాధ్యులవుతారని బెదిరించాడు.
వక్ఫ్ ఆస్తుల ఆక్రమణను నిలువరించకపోతే దానికి బాధ్యత భారతీయ ముస్లిములదేనని జకీర్ నాయక్ తేల్చేసాడు. వక్ఫ్ ఆస్తులు వ్యక్తిగతమైనవి తప్ప ప్రభుత్వానికి కావని వాదించిన జకీర్ నాయక్, వక్ఫ్ సవరణ బిల్లు ద్వారా ఆ ఆస్తులను ఆక్రమించి స్వాధీనం చేసుకునేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించాడు.
అయితే జకీర్ నాయక్ ఆరోపణల మీద వక్ఫ్ బోర్డు అత్యంత అసాధారణంగా ప్రతిస్పందించింది. తమకు సంబంధించిన వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నాడని జకీర్ నాయక్‌ను విమర్శించిన వక్ఫ్ బోర్డు, అలా చేయకుండా సంయమనం పాటించాలని కోరింది. ఆ వ్యవహారంపై తమ స్వతంత్ర వైఖరిని నిశ్చితంగా చెబుతూ, జకీర్ నాయక్ మీద కఠిన చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చింది.
జకీర్ నాయక్ ముంబైలో పుట్టి డాక్టర్ నుంచి ముస్లిం మతప్రచారకుడిగా మారిన వ్యక్తి. ఇస్లాం మత ప్రచారం కోసం ఇస్లామిక్ రిసెర్చ్ ఫౌండేషన్ అనే సంస్థను స్థాపించాడు. అతని మీద – ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడం, మనీ లాండరింగ్, మత విద్వేషాలను రెచ్చగొట్టే ప్రకటనలు చేయడం వంటి పలు ఆరోపణలున్నాయి. జకీర్ నాయక్ పాఠశాలల్లో హిందూ వ్యతిరేక ప్రచారం, వాటి సిలబస్‌లో జాతివ్యతిరేక పాఠాలను బోధించడం వంటి నేరాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలున్నాయి.
ఈ ఆరోపణల మధ్యనే జకీర్ నాయక్ 2016లో భారత్ వదిలి ఎగిరిపోయాడు. మలేషియాలో తల దాచుకున్నాడు. అప్పటినుంచీ భారతదేశం అతన్ని పరారీలో ఉన్న వ్యక్తిగా ప్రకటించింది, అతన్ని భారత్ తిరిగి తీసుకురావడానికి ఇంటర్‌పోల్ సహాయం అర్ధించింది.
నాయక్ గతంలో ఎన్నో వివాదాస్పద ప్రకటనలు చేసారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా క్రైస్తవులకు శుభాకాంక్షలు చెప్పడమూ ఇస్లాం మతానికి వ్యతిరేకమే అన్నారు. 2016 జులైలో ఢాకాలో జరిగిన ఉగ్రవాద దాడి నిందితుల్లో ఒక వ్యక్తి జకీర్ నాయక్ అనుచరుడు. దాంతో, ఉగ్రవాదులను ప్రోత్సహించి హింసాకాండకు పురిగొల్పాడని కూడా జకీర్ మీద ఆరోపణలు ఉన్నాయి. అమెరికా, కెనడా దేశాలు జకీర్ నాయక్ తమ దేశంలోకి రాకుండా ఆంక్షలు విధించాయి. జకీర్ నాయక్ ప్రసంగాల వల్ల మతాల మధ్య ఘర్షణలు చెలరేగే అవకాశముందని అనుమానిస్తూ మలేషియా కూడా నిషేధం విధించింది.