హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలోని సంజౌలి మసీదు వివాదం రోజురోజుకు తీవ్రం అవుతోంది. అక్రమంగా నిర్మాణం చేపట్టారని హిందూ సంఘాలు, స్థానికులు ఆరోపిస్తున్నారు. వెంటనే అక్రమ నిర్మాణాన్ని కూల్చివేయాలని కొన్ని రోజులుగా డిమాండ్ చేస్తున్నారు. ఆందోళనకారులపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. పోలీసుల చర్యలను నిరసిస్తూ హిందూ సంఘాలు రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చాయి.
స్థానికులు, హిందూ సంఘాల నేతలు బహిరంగంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. సిమ్లా, కులు సహా ఇతర ప్రాంతాల్లో దుకాణాలు మూతపడ్డాయి. బంద్ సందర్భంగా పోలీసులు భారీగా మోహరించారు.
దేవభూమి సంఘటన్ ఆధ్వర్యంలో హిందూ సంఘాలు, స్థానికులు బుధవారం నాడు మసీదు ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పోలీసులు, ఆందోళనకారులపై లాఠీ ఛార్జ్ చేశారు.
అక్రమంగా మసీదు నిర్మించారంటూ నిరసనలు వెల్లువెత్తడంపై ముస్లిం కమిటీ స్పందించింది. కోర్టు తీర్పునకు అనుగుణంగా అక్రమ నిర్మాణాన్ని తామే కూల్చివేస్తామని తెలిపింది. అప్పటి వరకు వివాదాస్పద భాగాన్ని సీల్ చేయాలని స్థానిక అధికారులకు మెమోరాండం సమర్పించింది.