భారత క్రికెట్ క్రీడాకారిణి జెమీమా రోడ్రిగ్స్ తన తండ్రి చేసిన నేరానికి తను దెబ్బతింది. ప్రఖ్యాత ఖర్ జిమ్ఖానా క్లబ్లో ఆమెకు గౌరవ సభ్యత్వం ఉండేది. దాన్ని వాడుకుని జిమ్ఖానా ఆవరణలో మతమార్పిడులకు పాల్పడ్డాడు జెమీమా తండ్రి ఇవాన్ రోడ్రిగ్స్. ప్రత్యేకించి, హిందువులను క్రైస్తవులుగా మతం మార్చడానికి 34 కార్యక్రమాలు నిర్వహించాడు. దాంతో క్లబ్ యాజమాన్యం జెమీమా గౌరవ సభ్యత్వాన్ని రద్దుచేసింది.
ఖర్ జిమ్ఖానా ముంబైలోని ప్రతిష్ఠాత్మక స్పోర్ట్స్ క్లబ్. ఆ క్లబ్‌కు చెందిన పలువురు సభ్యులు జెమీమా తండ్రి ఇవాన్ రోడ్రిగ్స్ మీద ఫిర్యాదులు చేసారు. హిందువులను క్రైస్తవంలోకి మతమార్పిడి చేయడమే లక్ష్యంగా క్లబ్ ఆవరణలో మత సమావేశాలు నిర్వహిస్తున్నాడంటూ వారు ఫిర్యాదు చేసారు. క్లబ్‌లోని ప్రెసిడెన్షియల్ హాల్‌ను మతపరమైన కార్యక్రమాల కోసం ఇవాన్ బుక్ చేసుకున్నాడని జిమ్ఖానా అధికారులు స్పష్టం చేసారు. జిమ్ఖానా నియమాల ప్రకారం క్లబ్‌ను మతపరమైన, రాజకీయపరమైన కార్యకలాపాలకు వినియోగించడం నిషిద్ధం.
ఇవాన్ రోడ్రిగ్స్ క్లబ్ హాల్‌ను సామూహిక మతమార్పిడి కార్యక్రమాలకు వాడుకోవడం దుర్వినియోగమేనని క్లబ్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేసారు. దాంతో క్లబ్ యాజమాన్యం జెమీమాకు ఇచ్చిన మూడేళ్ళ గౌరవ సభ్యత్వాన్ని రద్దు చేయాలని నిర్ణయించింది.
ఇవాన్ రోడ్రిగ్స్‌కు బ్రదర్ మాన్యుయెల్ మినిస్ట్రీస్ అనే సంస్థతో సంబంధాలున్నాయి. గత ఏడాదిన్నర కాలంలో ఇవాన్ ఆ క్లబ్లో ఏకంగా 35 సార్లు సామూహిక మతమార్పిడి కార్యక్రమాలు నిర్వహించారు. బలహీన మనస్కులైన హిందువులను లక్ష్యంగా చేసుకుని మతం మార్చడమే అజెండాగా ఆ కార్యక్రమాలు జరిగాయి. జెమీమా సభ్యత్వాన్ని దుర్వినియోగం చేసి అటువంటి పనులకు క్లబ్‌ను వాడుకోవడం ఆందోళన కలిగించిన అంశమని ఖర్ జిమ్ఖానా సభ్యుడు శివ మల్హోత్రా స్పష్టం చేసారు. ఇవాన్ 2023 మార్చి నుంచి 2024 నవంబర్ వరకూ క్లబ్‌లోని ప్రెసిడెన్షియల్ హాల్‌ను వారాంతాల్లో మతపరమైన కార్యక్రమాల కోసం బుక్ చేసుకునేవాడు, దానివల్ల క్లబ్‌లోని ఇతర సభ్యుల సొంత వేడుకలకు సైతం అవకాశం దొరికేది కాదని శివ మల్హోత్రా వివరించారు. సాధారణంగా క్లబ్ బుకింగ్‌కు డిస్కౌంట్ ఇచ్చేవారని, చాలాసార్లు సెక్యూరిటీ డిపాజిట్ కూడా తీసుకోలేదనీ తెలిసింది. దాంతో గౌరవ సభ్యత్వం అనే అవకాశాన్ని దుర్వినియోగం చేసారన్న ఆరోపణలకు మరింత బలం చేకూరింది. జెమీమా గొప్ప క్రీడాకారిణి, భారతదేశానికి గర్వకారణం అయినప్పటికీ ఆమె తండ్రి చర్యలు తీవ్ర విమర్శలకు తావిచ్చాయి.
ఖర్ జిమ్‌ఖానాలో సభ్యత్వం అనేది క్రీడాకారులకు ప్రత్యేక గుర్తింపు. మహిళా క్రికెట్‌కు జెమీమా సేవలకు గుర్తింపుగా ఆ క్లబ్ 2023లో గౌరవ సభ్యత్వం ఇచ్చింది. అయితే ఇటీవల జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశంలో జెమీమా తండ్రి చర్యల కారణంగా ఆమె సభ్యత్వం గురించి ఓటింగ్ పెట్టారు. దాంట్లో అత్యధిక సభ్యులు జెమీమా సభ్యత్వాన్ని రద్దు చేయాలనే ఓటువేసారు.
ఈ వ్యవహారం దేశంలో మత మార్పిడులు జరుగుతున్న తీరుతెన్నులను మరోసారి చర్చకు పెట్టాయి. మత మార్పిడుల అంశం కొన్ని దశాబ్దాలుగా రాజకీయ, సామాజిక మతపరమైన ఉద్రిక్తతలను రగిలిస్తూనే ఉంది. ప్రత్యేకించి క్రైస్తవులు, ముస్లిములు భారతదేశంలో మెజారిటీ మతస్తులైన హిందువులను సామూహికంగా తమ మతాల్లోకి మార్చడానికి చేస్తున్న ప్రయత్నాలు చాలాచోట్ల గొడవలకూ కారణమవుతున్నాయి.