రాజ్యాంగ పరిషత్తు హిందీని భారత ప్రభుత్వపు అధికార భాషగా 1949 సెప్టెంబర్ 14న ప్రకటించింది. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రతీయేటా సెప్టెంబర్ 14న హిందీ దివస్ జరుపుకుంటాం. దేశంలోని పలు ప్రాంతాల్లో విస్తృతంగా మాట్లాడే హిందీ భాషకు ప్రాచుర్యం కలిగించడం కోసం ఈ దినాన్ని ఏర్పాటు చేసారు. ఆ చారిత్రక నిర్ణయం ప్రాధాన్యతను గుర్తిస్తూ, దేశవ్యాప్తంగా హిందీ వినియోగాన్ని పెంచడం కోసం 1953 నుంచీ హిందీ దివస్ నిర్వహిస్తున్నారు.
హిందీని అధికార భాషగా ఏర్పాటు చేయాలన్న ఉద్యమం స్వాతంత్ర్యం తరువాతే ఊపందుకుంది. వ్యవహార్ రాజేంద్ర సింగ్, కాకా కలేల్కర్, హజారీ ప్రసాద్ ద్వివేదీ, సేఠ్ గోవింద్ దాస్ వంటి ప్రముఖుల అవిశ్రాంత కృషితో హిందీకి అధికార భాష హోదా తగ్గింది.
హిందీ ఉద్యమం మూలాలు 1918లో ఉన్నాయి. ఆ యేడాది జరిగిన సాహిత్య సమ్మేళన్ సందర్భంగా మహాత్మా గాంధీ భారతదేశానికి హిందీని అధికార భాష చేయాలని సలహా ఇచ్చారు. హిందీ సామాన్య ప్రజల భాష అని ఆయన అన్నారు. స్వతంత్రతం తర్వాత భారతదేశపు అధికార భాష గురించి విస్తృతంగా చర్చలు జరిగాయి. వాటి ఫలితంగా 1949 సెప్టెంబర్ 14న హిందీని అధికార భాషగా ప్రకటించారు. భారత రాజ్యాంగపు 343(1) అధికరణం దేవనాగరి లిపిలోని హిందీభాషను అధికార భాషగా ఏర్పాటు చేసింది. అధికారిక అవసరాల కోసం అంకెలను అంతర్జాతీయంగా అనుసరిస్తున్న విధానంలోని అంకెలనే తీసుకుంది.
అయితే హిందీని జాతీయ భాషగా ఎంపిక చేయడం మీద హిందీయేతర రాష్ట్రాల నుంచి వ్యతిరేకత వచ్చింది. దాంతో ఇంగ్లీషుకు కూడా అధికార భాష హోదా కల్పించారు. కాలక్రమంలో అధికారిక, పరిపాలనా అవసరాల్లో హిందీ వాడకం మీద ఆంగ్లం ప్రభావం ఎక్కువయింది. వర్తమానంలో హిందీ దివస్ అనేది భారతదేశపు భాషా వైవిధ్యాన్ని సూచించే ప్రయత్నంగా నిలిచింది. అన్ని ప్రాంతీయ భాషల ప్రాధాన్యాన్నీ గౌరవిస్తూ, దేశాన్ని ఒక ఉమ్మడి భాషతో ఐక్యం చేసే ప్రయత్నాలకు హిందీ దివస్ జ్ఞాపికగా మిగిలింది.
హిందీదివస్ సందర్భంగా దేశప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. అభివృద్ధి చెందిన భారతదేశాన్ని సాధించడానికి హిందీ సాయపడుతుందని హోంమంత్రి అమిత్ షా అన్నారు. ‘‘భారతీయ భాషలన్నీ మనకు గర్వకారణం, మన వారసత్వ సంపద. వాటి ఎదుగుదలతోనే మనం పురోగమించగలం. అధికార భాష హిందీకి అన్ని భారతీయ భాషలతోనూ అవిచ్ఛిన్నమైన సంబంధముంది. ఈ యేడాది హిందీ ప్రజా ప్రసార భాషగా, అధికార భాషగా ప్రకటితమై 75 ఏళ్ళు పూర్తి చేసుకుంది. అభివృద్ధి చెందిన భారతదేశం అనే తీర్మానాన్ని సాకారం చేయడానికి అధికార భాష హిందీ అన్ని భారతీయ భాషలనూ తోడు తీసుకుని సహాయపడగలదని విశ్వసిస్తున్నాను’’ అని అమిత్ షా ట్వీట్ చేసారు.