ఉచిత ఇసుక సరఫరాకు ప్రభుత్వం జీపీఎస్ సదుపాయం ఉన్న వేలాది లారీలను సిద్దం చేస్తోంది. ఇప్పటికే 3 వేల ట్రక్కులు ఇచ్చేందుకు యజమానులు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. వీటి సంఖ్య 5 వేలకు పెరిగే అవకాశముందని గనుల శాఖ అధికారులు చెబుతున్నారు. వచ్చే వారం నుంచి గ్రామ, వార్డు సచివాలయాల్లో ఇసుక బుక్ చేసుకున్న వారి ఇంటికే సరఫరా చేయనున్నారు. దీనికోసం రవాణా ఖర్చులు, తవ్వకాల ఖర్చులు వసూలు చేయనున్నారు. పది కిలోమీటర్లలోపు అయితే టన్నుకు రూ.12 వసూలు చేయాలని నిర్ణయించారు. ఇక దూరం పెరిగే కొద్దీ రవాణా ఛార్జీలు తగ్గుతాయి. 40 కి.మీ దాటితే టన్నుకు కి.లో మీటరుకు రూ.6 వసూలు చేయనున్నారు.
ప్రైవేటు భూముల్లోనూ ఇసుక తవ్వేందుకు కేంద్ర పర్యావరణ శాఖ నుంచి అనుమతుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. వరదలు తగ్గగానే ఇసుక కొరత లేకుండా చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు ఆన్‌లైన్ బుకింగ్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉచిత ఇసుక బుక్ చేసుకుంటే నేరుగా వినియోగదారుని ఇంటికే సరఫరా చేయనున్నారు. మొత్తం ఆన్‌లైన్ చేయడం, జీపీఎస్ లారీలను ఉపయోగించడంతో ఇసుక పక్కదారి పట్టే అవకాశం లేదని గనుల శాఖ అధికారులు చెబుతున్నారు.