పారిస్ వేదికగా జరిగిన పారాలింపిక్స్-2024లో పతకాలు సాధించిన భారత అథ్లెట్లతో ప్రధాని మోదీ సమావేశం అయ్యారు. దిల్లీలోని తన అధికారిక నివాసంలో సమావేశమై క్రీడాకారులకు అభినందనలు తెలిపారు. ఈ భేటీలో కేంద్ర క్రీడా మంత్రి మన్‌సుఖ్ మాండవీయ, పారాలింపిక్స్ కమిటీ ఆఫ్ ఇండియా (పీసీఐ) హెడ్ దేవేంద్ర జజారియా పాల్గొన్నారు.
అంతర్జాతీయ వేదికపై భారత అథ్లెట్లు 29 పతకాలు సాధించడం అభినందనీయమని ప్రధాని మోదీ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. క్రీడాకారుల అంకితభావంతోనే ఇది సాధ్యమైంది.ఎంతోమందికి ఈ విజయం స్ఫూర్తిదాయకం అని ఎక్స్ లో పేర్కొన్నారు .
ఆర్చరీ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించిన హర్విందర్ సింగ్, ప్రధానితో జరిగిన సమావేశంలోని విశేషాలను మీడియాతో పంచుకున్నారు. ప్రధాని తమను ఎంతో ప్రోత్సహించారని తెలిపారు. ప్రధానికి తన బాణాన్ని బహుమతిగా ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు.
పారాలింపిక్స్‌లో ఏడు స్వర్ణాలు, తొమ్మిది రజతాలు, 13 కాంస్య పతకాలను భారత అథ్లెట్లు గెలిచారు. టోర్నీ కోసం 84 మందితో భారత బృందం పారిస్‌కు వెళ్లింది. స్వర్ణ పతక విజేతలకు రూ. 75 లక్షలు, సిల్వర్ మెడల్ విజేతలకు రూ. 50 లక్షలు, కాంస్య పతక విజేతకు రూ. 30 లక్షలు నజరనాను కేంద్రప్రభుత్వం ప్రకటించింది.