అస్సాంలోని హైలాకండి జిల్లాలో పన్నెండేళ్ళుగా అక్రమంగా నివసిస్తున్న బంగ్లాదేశీ చొరబాటుదారుడు మొహమ్మద్ సంసుద్దీన్‌ను పోలీసులు అరెస్ట్ చేసారు. అతనికి తండ్రిగా నటిస్తూ సహకరించిన తాజుద్దీన్ అనే వ్యక్తిని కూడా పోలీసులు అరెస్ట్ చేసారు. ఈశాన్యభారతంలోని బలహీనమైన భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు గుండా జరుగుతున్న చొరబాట్లకు ఈ సంఘటన నిదర్శనంగా నిలుస్తుంది.
బంగ్లాదేశీ ముస్లిములకు అస్సాంలో నివసించడం చాలా సులువు అని ఈ సంఘటన ద్వారా తెలుస్తోంది. బంగ్లాదేశీ పౌరుడైన మొహమ్మద్ సంసుద్దీన్ ఆ దేశపు సరిహద్దుకు దగ్గరగా ఉన్న తూర్పు అస్సాంలోని హైలాకండి జిల్లాలో గత పన్నెండేళ్ళుగా నివసిస్తున్నాడు. అతనికి కావలసినప్పుడల్లా స్వదేశానికి వెళ్ళి వస్తున్నాడు. అతనికి ఆశ్రయం ఇచ్చిన తాజుద్దీన్ కూడా భారత్‌లోకి అక్రమంగా చొరబడిన బంగ్లాదేశీయుడే. సంసుద్దీన్ తన కొడుకు అని చెప్పి అతనికి భారత్‌లో ఆశ్రయం ఇచ్చాడు. వారిద్దరినీ అస్సాం పోలీసులు సెప్టెంబర్ 10న అరెస్ట్ చేసారు. వీరిద్దరూ దొరికిన దొంగలు మాత్రమే. దొరకని దొంగలు ఇంకెంతమంది ఉన్నారో. అలాంటి బంగ్లాదేశీ చొరబాటుదారులు అస్సాంలో ఏకంగా ఓటర్ల జాబితాలో చోటు దక్కించుకున్నారు.
ఆగస్టు 4న హుమాయూన్ కబీర్ అనే బంగ్లాదేశీ జాతీయుడు అస్సాంలోని ఢింగ్ వద్ద పోలీసులకు దొరికాడు. అతను బంగ్లాదేశ్‌లోని సిల్హెట్ జల్లా నుంచి భారత్‌లోకి ప్రవేశించి మేఘాలయలోని డాకి ప్రాంతం గుండా ప్రయాణించి అస్సాంలోకి చేరుకున్నాడు. అరెస్ట్ చేసినప్పుడు అతని దగ్గర రెండు బంగ్లాదేశీ సిమ్ కార్డులు, ఒక సెల్ ఫోన్ దొరికాయి. పశువుల అక్రమ వ్యాపారం కోసం అతను మేఘాలయ మీదుగా అస్సాంలోకి చొరబడ్డాడు. నగావ్ జిల్లా ఖటోవాల్ గ్రామంలో ప్రజలు అతన్ని విదేశీయుడిగా గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఢింగ్ సంతలో పశువులను కొనే ప్రయత్నం చేస్తుండగా పట్టుబడ్డాడు. అతనికి ఆశ్రయం ఇచ్చిన మోతిబుర్ రెహమాన్, అబుల్ హుసేన్, మక్బూల్ హుసేన్‌లను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కబీర్ సంతలో కొన్న తొమ్మిది ఆవులను స్వాధీనం చేసుకున్నారు.
నిన్న సెప్టెంబర్ 10, మంగళవారం నాడు గువాహటి ఫ్రాంటియర్ విభాగానికి చెందిన బిఎస్ఎఫ్ జవాన్లు అంతర్జాతీయ సరిహద్దు వద్ద భారత భూభాగంలోకి చొరబడిన ఒక బంగ్లాదేశీయుడిని పట్టుకున్నారు. అయితే గుడ్‌విల్ గెశ్చర్ కింద అతన్ని బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్ జవాన్లకు అప్పగించేసారు.