ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. జగన్ పాస్ పోర్టు ను రెన్యూవల్ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. రెన్యూవల్ కాలాన్ని ఐదేళ్లకు పెంచాలని తీర్పులో హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో వైఎస్ జగన్ విదేశీ పర్యటనకు ఏర్పడిన అడ్డంకులు తొలగాయి.
ఆంధ్రప్రదేశ్ లో అధికారం కోల్పోయిన తర్వాత జగన్ కు అప్పటి వరకున్న డిప్లొమాటిక్ పాస్ పోర్ట్ రద్దు అయింది. దీంతో ఆయన సాధారణ పాస్ పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.
విజయవాడలోని ప్రజాప్రతినిధుల కోర్టు జగన్ పాస్ పోర్ట్ కాలపరిమితిని ఏడాదికి కుదించింది. దీంతో పాటు పలు షరతులు విధించింది. రూ. 20 వేలు పూచీకత్తు సమర్పించాలని ఆదేశించింది. ఈ విషయాన్ని వైఎస్ జగన్ హైకోర్టులో సవాల్ చేయగా , ఐదేళ్ల కాలపరిమితితో పాస్ పోర్ట్ జారీ చేయాలని న్యాయస్థానం తీర్పు చెప్పింది.