జీడిపిక్కల లారీ బోల్తా కొట్టిన ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా పరిధిలో చోటుచేసుకుంది. ఈ ఘోర ఘటనలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మంగళవారం అర్ధరాత్రి తర్వాత ఈ దారుణం జరిగింది.
ఏలూరు జిల్లా టి.నరసాపురం మండలం బొర్రంపాలెం నుంచి జీడిపిక్కల లోడుతో తూర్పుగోదావరి జిల్లాకు లారీ బయలు దేరింది. నిడదవోలు మండలం తాడిమళ్లకు లారీ వెళ్ళాల్సి ఉంది. అయితే ఆరిపాటిదిబ్బంలు-చిన్నాయిగూడెం రోడ్డులోని దేవరపల్లి మండలం చిలకావారిపాకలు సమీపంలో లారీ అదుపుతప్పి బోల్తాకొట్టింది. దీంతో జీడిపిక్కల బస్తాల కింద చిక్కుకున్న ఏడుగురు చనిపోయారు. డ్రైవర్ పారిపోయాడు.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. తాడిమళ్ళ గ్రామానికి చెందిన దేవాబత్తుల బూరయ్య, తమ్మిరెడ్డి సత్యనారాయణ, పి. చినముసలయ్య, కత్తవ కృష్ణ, కత్తవ సత్తిపండు, తాడి కృష్ణ, నిడదవోలు మండలంలోని కాటకోటేశ్వరరానికి చెందిన బొక్కా ప్రసాద్ చనిపోయారు. వీరంతో 45 ఏళ్ళ లోపు వయస్సు వారే.
ప్రమాదం గురించి తెలుసుకున్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఏడుగురు కూలీలు ప్రాణాలు కోల్పోవడం కలచివేసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.
ఘటన బాధాకరమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. కష్టజీవులు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం తగిన విధంగా ఆదుకుంటుందన్నారు.