మెయితీ తెగకు చెందిన సాధారణ పౌరులు, భద్రతా బలగాల మీద కుకీ తీవ్రవాదులు చేసిన వరుస డ్రోన్ దాడుల కారణంగా మణిపూర్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. శాంతిభద్రతల పరిస్థితులు క్షీణించడం వల్ల రాష్ట్రంలోని మూడు జిల్లాల్లో కర్ఫ్యూ మళ్ళీ విధించారు.
ఇంఫాల్ తూర్పు, ఇంఫాల్ పశ్చిమ జిల్లాల్లో సెప్టెంబర్ 1 నుంచి కర్ఫ్యూ విధించారు. భారతీయ నాగరిక్ సురక్షా సంహిత 2023లోని సెక్షన్ 163 ప్రకారం ప్రజలు బైట తిరగకూడదంటూ నిషేధాజ్ఞలు విధించారు. సెప్టెంబర్ 10, అంటే ఈరోజు కర్ఫ్యూను ఉదయం 5గంటల నుంచి రాత్రి 10గంటల వరకూ సడలించారు. అయితే ఈ ఉదయం 11గంటలకు ఆ సడలింపును తొలగించారు, మళ్ళీ కర్ఫ్యూ విధించారు. తదుపరి ఉత్తర్వులు జారీ చేసేవరకూ కర్ఫ్యూ కొనసాగుతుంది అని వెల్లడించారు. వైద్య, ఆరోగ్య, విద్యుత్, న్యాయ విభాగాలతో పాటు మీడియాలో పనిచేసేవారికి కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఇచ్చారు.
తౌబాల్ జిల్లా అంతటా కర్ఫ్యూ అమల్లో ఉంటుందని జిల్లా కలెక్టర్ ప్రకటించారు. జిల్లాలోని శాంతిభద్రతల పరిస్థితి గురించి ఎస్పి ఇచ్చిన నివేదిక ఆధారంగా కలెక్టర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. తౌబాల్ జిల్లాలో ఈ మధ్యాహ్నం నుంచి కర్ఫ్యూ అమల్లోకి వచ్చింది. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకూ కర్ఫ్యూ కొనసాగుతుంది. భద్రతా బలగాలు, విద్యుత్, వైద్యం, తాగునీటి సరఫరా వంటి అత్యవసర విభాగాల ఉద్యోగులకు మాత్రం మినహాయింపు ఇచ్చారు.