పారాలింపిక్స్ లో భారత్ పతకాల సంఖ్య 29కి చేరింది. మరో స్వర్ణ పతకాన్ని భారత్ సాధించింది. పురుషుల జావెలిన్ త్రో ఎఫ్-41 విభాగంలో నవదీప్ సింగ్ ఈ ఘనత సాధించాడు. మహిళల 200 మీటర్ల టీ12 విభాగంలో సిమ్రాన్ శర్మకు కాంస్యం దక్కింది. దీంతో భారత్ మొత్తం పతకాల సంఖ్య 29కి చేరగా అందులో 7 స్వర్ణాలు, 9 రజతాలు, 13 కాంస్యాలు ఉన్నాయి.
శనివారం ఆర్ధరాత్రి జరిగిన ఫైనల్లో 47.32 మీటర్ల త్రో విసిరిన నవదీప్ సింగ్, తొలుత రెండో స్ధానంలో నిలిచి రజతం సాధించాడు. ఇరాన్ క్రీడాకారుడు సదేగ్ బీత్ సయా 47.64 మీటర్ల దూరం విసిరి మొదటి స్థానం సాధించాడు.
అయితే అంతర్జాతీయ పారాలింపిక్ కమిటీ నిబంధనలు ఉల్లంఘించినందుకు సదేగ్ బీత్ అనర్హతకు గురయ్యారు. ఈవెంట్‌లో రెండు సార్లు అతడు ఎల్లో కార్డ్ అందుకున్నాడు. ఫలితంగా ఆఖరికి రెడ్ కార్డ్‌తో పతకానికి అనర్హుడిగా తేలాడు. దీంతో రెండో స్థానంలో నిలిచిన నవదీప్ సింగ్ రజత పతకం కాస్తా స్వర్ణంగా మారింది.