బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారడంతో తెలుగు రాష్ట్రాలు మరికొన్ని రోజులు తడిసి ముద్దకానున్నాయి. తీవ్ర అల్పపీడనం ఉత్తర దిశగా ప్రయాణిస్తూ ఒడిశా, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాల్లో సోమవారం నాటికి వాయుగుండంగా మారనుంది. ఆ తర్వాత మూడు రోజుల్లో పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ ఉత్తర ఒడిశా, జార్ఖండ్, ఉత్తర ఛత్తీస్ గఢ్ మీదుగా ప్రయాణించే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లోని దక్షిణ కోస్తాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి.
విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, కృష్ణా జిల్లా, డా బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ, అనకాపల్లిలో కొన్ని చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముంది. .
విజయవాడ లో శనివారం రాత్రి భారీవర్షం కురిసింది. దీంతో సహాయ కార్యక్రమాలకు అంతరాయం ఏర్పడింది. జక్కంపూడి కాలనీ, అంబాపురం వెళ్లే మార్గాల్లో ఇంకా నీళ్లున్నాయి.
తెలంగాణలోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. వచ్చే నాలుగు రోజులు పాటువానలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆదివారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షం చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది.
ఖమ్మం జిల్లాలో హైలెర్ట్ ప్రకటించారు , మున్నేరు వరద ప్రవాహం 16 అడుగులకు చేరింది. జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు ఇప్పటికే ఖమ్మం చేరుకుని తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులతో చర్చిస్తున్నారు.
24 అడుగులకు చేరితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. అధికారులు వరద ప్రభావిత కాలనీల్లోని బాధితులను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు.
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వానలతో ఆదివారం అర్ధరాత్రికి మళ్లీ వరద వచ్చే అవకాశం ఉంది. దీంతో వరద ప్రభావిత ప్రాంతంలోని రోడ్లను అధికారులు బ్లాక్ చేశారు. రాకపోకలపై ఆంక్షలు విధించారు.