వరద ప్రవాహం మరోసారి విజయవాడను ముంచెత్తింది. శుక్రవారం సాయంత్రం ఒక్కసారిగా 2 అడుగుల మేర వరద పెరగడంతో సింగ్‌నగర్, రాజరాజేశ్వరిపేట, జక్కంపూడి కాలని, అంబాపురం రూరల్, ప్రకాశ్ నగర్ ప్రాంతాల్లో రోడ్లపై 3 అడుగుల నీరు చేరింది. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షం కురవడంతో వరద చేరింది. అయితే క్రమంగా వెలగలేరు రెగ్యులేటర్ వద్ద వరద తగ్గుముఖం పట్టింది. శుక్రవారం సాయంత్రానికి వెలగలేరు వద్ద వరద 2 వేల క్యూసెక్కులకు తగ్గింది. దీంతో విజయవాడ వాసులు ఊపిరి పీల్చుకున్నారు.
విజయవాడలో తగ్గిన వరద క్రమంగా ఉంగుటూరు, గన్నవరం, కేసరపల్లి వైపు సాగుతోంది. పంట పొలాలను ముంచెత్తింది. గుడివాడ, నందివాడ మండలాల్లో ఒక్కసారిగా బుడమేరు వరద పెరగడంతో పంట పొలాలు నీట మునిగాయి. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నందివాడలో అధికారులు సహాయక చర్యలు ప్రారంభించారు.
బుడమేరుకు పడిన మూడు అతి పెద్ద గండ్లలో రెండు పూడ్చి వేశారు. మరో భారీ గండి పూడ్చేందుకు ఆర్మీ అధికారుల సాయం తీసుకున్నారు. ఆదివారం సాయంత్రానికి మూడో గండిని కూడా పూర్తిగా పూడ్చివేయనున్నారు. మూడో గండిని పూడ్చితే బుడమేరు వరద విజయవాడను తాకే అవకాశం లేదు.వెలగలేరు డైవర్షన్ ఛానల్ నుంచి కృష్ణా నదిలో కలుస్తుంది.
విస్తృతంగా వరద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బాధితులకు రోజుకు మూడుసార్లు ఆహారం అందిస్తున్నారు. బురద చేరిన ఇళ్లను ఫైరింజన్లతో కడుగుతున్నారు. బాధితులకు బియ్యం, వంట సామగ్రి ఉచితంగా అందించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు.