సమాజంలో ఆధ్యాత్మిక భావజాలాన్ని వ్యాపింపజేయడానికి ప్రాచీన వైదిక వాఙ్మయాన్ని ఆధునిక రీతిలో పునరుజ్జీవింపజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆర్ఎస్ఎస్ సర్సంఘచాలక్ డాక్టర్ మోహన్ భాగవత్ పిలుపునిచ్చారు. ‘‘వర్తమాన సమాజంలో విశ్వాసాన్ని సజీవంగా ఉంచడానికి వేదాల జ్ఞానాన్ని సామాన్య ప్రజలకు ఎప్పటికప్పుడు అందజేయాలి’’ అని ఆయన వివరించారు. మహారాష్ట్ర పుణేలోని బాలగంధర్వ రంగమందిరంలో సెప్టెంబర్ 4న వేదసేవకుల సన్మాన కార్యక్రమంలో భాగవత్ పాల్గొన్నారు.
అయోధ్యలో 16 నెలల పాటు కఠోర అనుష్ఠాన వ్రతం అవలంబించిన వైదిక పండితులను సన్మానించే కార్యక్రమం పుణేలో జరిగింది. ఆ కార్యక్రమాన్ని అయోధ్యకు చెందిన శ్రీరామజన్మభూమి తీర్థక్షేత్రన్యాస్, పుణేకు చెందిన శ్రీ సద్గురు గ్రూప్ సంయుక్తంగా నిర్వహించాయి. మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాలకు చెందిన 240మంది పురోహితులు, వేదపండితులు 2022 నవంబర్ నుంచి 2024 ఫిబ్రవరి వరకూ అయోధ్యలో నాలుగు వేదాల పారాయణం, పూజాదికాలు, ప్రార్ధనా కార్యక్రమాలూ చేపట్టారు.
వేదాలలో అనంతమైన జ్ఞానం నిక్షిప్తమై ఉందని భాగవత్ చెప్పారు. వేదాలు ప్రాచీనమైనవి మాత్రమే కావనీ, అవి భారత ఆధ్యాత్మిక వారసత్వానికి పునాదులనీ వివరించారు. ‘‘వైదిక జ్ఞానాన్ని కొత్త తరాలకు ఆధునిక రూపంలో అందించాలి. వారు ఆ జ్ఞానాన్ని ప్రపంచ శాంతి అనే సందేశంతో విశ్వమంతా వ్యాపింపజేస్తారు’’ అని ఆకాంక్షించారు.
సంస్కృతీ క్షీణత గురించి హెచ్చరిక:
ప్రపంచంలోని ఇటీవలి సామాజిక, రాజకీయ పరిణామాల గురించి ప్రస్తావిస్తూ ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఉదాసీనత, విరోధ భావాల పట్ల ఆందోళన వ్యక్తం చేసారు. ప్రపంచశాంతిని అస్థిరపరిచేందుకు దుష్టశక్తులన్నీ ఏకమవుతున్నాయని హెచ్చరించారు. అమెరికా, పోలండ్ దేశాల్లో సాంస్కృతిక విలువల పతనం, అరబ్బు దేశాల్లో పెరుగుతున్న అసహనం వంటి ఉదాహరణలతో ప్రపంచ శాంతికి ఎదురవుతున్న అవరోధాలను వివరించారు. అటువంటి అవరోధాలు భారతదేశంలోకి కూడా త్వరలోనే రావొచ్చని ఆందోళన వ్యక్తం చేసారు. ‘‘అటువంటి దుష్టశక్తులను ఎదుర్కొనే సామర్థ్యం మనకు ఉంది, ఎందుకంటే మనకు వేదాల వంటి ప్రాచీన వాఙ్మయం రూపంలో జ్ఞానం అందుబాటులో ఉంది’’ అని చెప్పారు. ఆ జ్ఞానాన్ని వర్తమాన సమాజానికి అర్ధమయ్యే విధంగా ఆధునిక రూపంలో అందించాలని కోరారు.
భాగవత్ తన సందేశంలో కుటుంబ విలువల వ్యవస్థను పరిరక్షించుకోవలసిన ప్రాధాన్యతను నొక్కిచెప్పారు. మనం అనుసరిస్తున్న ప్రాచీన సంప్రదాయాల కారణంగా మన దేశంలో కుటుంబ విలువలు బలంగా ఉన్నాయని చెప్పారు. ‘‘ప్రపంచమంతటా కుటుంబ వ్యవస్థ నాశనమైపోతుంటే, ఆ వ్యవస్థ మన దేశంలో ఇంకా దృఢంగా పటిష్ఠంగా నిలిచి ఉంది. దానికి కారణం మన దేశంలో కుటుంబ వ్యవస్థకు విలువ ఎక్కువ ఉండడమే’’ అని గమనించారు. అటువంటి విలువలను ప్రచారం చేయాలంటూ వేద సేవకులకు పిలుపునిచ్చారు.
వివక్ష అంతం, అందరినీ ఆదరించే తత్వం:
సమాజంలో వివక్షను, ప్రత్యేకించి అంటరానితనాన్ని నిర్మూలించాలని డాక్టర్ భాగవత్ పిలుపునిచ్చారు. ‘‘వేదాలలో అస్పృశ్యతకు చోటు లేదు. అలాంటప్పుడు సమాజంలో అటువంటి వివక్ష ఎందుకు?’’ అని ప్రశ్నించారు. సమాజం మరింత సమీకృతంగా ఉండాలని పిలుపునిచ్చారు.
ఆ కార్యక్రమంలో విశ్వహిందూపరిషత్ ఉపాధ్యక్షులు చంపత్ రాయ్, శ్రీరామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ కోశాధికారి స్వామి గోవిందదేవ్ గిరి మహరాజ్, భారత్ వికాస్ గ్రూప్ అధ్యక్షులు డా. హనుమంత్ గైక్వాడ్, సకాల్ మీడియా సంస్థ ఛైర్మన్ అభిజీత్ పవార్, సద్గురు గ్రూప్ వ్యవస్థాపకులు యశ్వంత్ కులకర్ణి తదితరులు పాల్గొన్నారు. అయోధ్య బాలరాముడి దేవాలయంలో నిర్మాణ ప్రణాళికల గురించి చంపత్ రాయ్ వివరించారు. స్వామి గోవిందదేవ్గిరి తన ప్రసంగంలో తపస్సు-దాని గుణగణాల గురించి వివరించారు. సనాతన భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తున్న ప్రతీపశక్తుల నుంచి పొంచివున్న ప్రమాదాల గురించి హెచ్చరించారు. అటువంటి శక్తులను అణచివేయడానికి ప్రజలందరూ తమ జీవితంలో కొన్ని సంవత్సరాలను సమాజం కోసం, దేశం కోసం కేటాయించాలని విజ్ఞప్తి చేసారు.